అమరావతి: తమ పార్టీ మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆనయ కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయడంపై తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ మేరకు ఆయన శనివారంనాడు ఓ ప్రకటన విడుదల చేశారు. హైదరాబాదులోని నివాసంలో జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడాన్ని ఆయన ఖండించారు. 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారని, ప్రజా సమస్యలపై చేస్తున్న తమ పోరాటాలను సహించలేక అక్రమ అరెస్టులకు తెర తీశారని ఆయన అన్నారు. ఏడాది పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరలించేందుకు టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. 

నిన్న అచ్చెన్నాయుడిని, నేడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం కక్ష సాధింపు చర్యలో భాగమేనని ఆయన అన్నారు. తాను జైలుకు వెళ్లాననే అక్కసుతో జగన్ కక్ష పెంచుకుని ఇతరులను జైలుకు పంపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. 

ప్రతీకారేచ్ఛతో జగన్ రాష్ట్రాన్ని పతనం చేస్తున్నారని, కక్ష సాధింపు చర్యలతో తమ పార్టీని ప్రజలకు దూరం చేయలేరని ఆయన అన్నారు. రెట్టించిన బలంతో ప్రజాసమస్యలపై పోరాడుతామని ఆయన చెప్పారు. అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామని ఆయన చెప్పారు. వైసీపీ ప్రజా వ్యతిరేక చర్యలను ఎండగడుతామని ఆయన చెప్పారు. 

ప్రజల అండదండలే టీడీపీ నేతలకు ఆశీస్సులని చంద్రబాబు చెప్పారు. జగన్ కక్ష సాధింపు చర్యలను, దుశ్చర్యలను ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు. 

తెలుగుదేశం పార్టీ (టీడీపీ) మాజీ శాసనసభ్యుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని అనంతపురం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన కుమారుడిని కూడా అరెస్టు చేశారు. వారిద్దరిని అనంతపురం పోలీసులు శనివారంనాడు హైదరాబాదులో అరెస్టు చేశారు. 

154 బస్సులకు సంబంధించి నకిలీ ఎన్ఓసీలు సృష్టించిన కేసులో వారిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇరువురిని పోలీసులు అనంతపురానికి తరలిస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టును పోలీసులు ధృవీకరించారు. అనంతపురం మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి. తాడిపత్రి ఎమ్మెల్యేగా జేసీ ప్రభాకర్ రెడ్డి పనిచేశారు.