జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిల అరెస్ట్‌ను నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. బీసీ నేత అచ్చెన్నాయుడి అక్రమ అరెస్ట్‌ను పక్కదారి పట్టించేందుకే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిను అరెస్ట్ చేశారని నారా లోకేష్ ఆరోపించారు. 

16 నెలల జైలు పక్షి, లక్ష కోట్ల దోపిడీదారు, 11 కేసుల్లో ఏ1 నిందితుడు జగన్‌రెడ్డి.. టీడీపీ నాయకుల్ని జైల్లో పెట్టి రాక్షస ఆనందం పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. ఏడాది పాలనలో జగన్ ఒక చేతగాని ముఖ్యమంత్రి అనే విషయం ప్రజలకు అర్థమైందని వ్యాఖ్యానించారు. జగన్‌ను అభద్రతా భావం వెంటాడుతోందని తెలిపారు. 

అందుకే రాజారెడ్డి రాజ్యాంగంలో వేధింపుల పర్వానికి తెరలేపారని ధ్వజమెత్తారు. ప్రలోభాలకు లొంగితే వైసీపీ కండువా, లొంగకపోతే జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుండే జేసీ కుటుంబంపై కక్ష సాధింపు మొదలు పెట్టారని గుర్తుచేశారు. 

ప్రతిపక్ష నేతలపై వేధింపులు, కక్ష తీర్చుకోవడానికే జగన్ ముఖ్యమంత్రి అయినట్టు ఉందని వ్యాఖ్యానించారు. సమర్థవంతంగా జగన్ గవర్నమెంట్ యొక్క టెర్రరిజాన్ని ఎదుర్కొంటామని నారా లోకేష్ స్పష్టం చేశారు.

 

కాగా..జేసీ అరెస్టు విషయంలో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి,జేసీ పవన్ తో లోకేష్ ఫోన్లో మాట్లాడారు. పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.