ఎవరితో కూడా ఎక్కువ కాలం పొసగదు. తన మాట చెల్లుబాటు కావటం లేదని అనుకుంటే చాలు ఇక వారిపై విమర్శలు, సెటైర్లే.

జెసి దివాకర్ రెడ్డి తడాకా ఏమిటో ఇపుడు టిడిపికి అర్ధమౌతోంది. జెసి జోరుకు ఏ విధంగా బ్రేకులు వేయాలో అర్ధం కాక టిడిపి ముఖ్యనేతలు తల పట్టుకుంటున్నారు. ఈ మాజీ కాంగ్రెస్ నేత, అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డిని కంట్రోల్ చేయటం ఎంత కష్టమో అందరికీ అర్ధమవుతోంది.

కాంగ్రెస్ లో ఉన్నంత కాలమూ ఆ పార్టీలోని ముఖ్యమంత్రులు కావచ్చు, లేదా అనంతపురం జిల్లాలోని నేతలు కావచ్చు ఎంత ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలమూ అసమ్మతి నేతగానే జెసి ముద్రపడ్డారు. తాను మంత్రిగా ఉన్నా అసమ్మతే, లేకపోయినా అసమ్మతే. జెసి తీరు గమనించిన వారికి అర్ధమయ్యేదేమంటే, జెసి నిత్య అసమ్మతి వాదని. ఎవరితో కూడా ఎక్కువ కాలం పొసగదు. తన మాట చెల్లుబాటు కావటం లేదని అనుకుంటే చాలు ఇక వారిపై విమర్శలు, సెటైర్లే.

రాష్ట్ర విభజన నేపధ్యంలో తప్పనిసరి పరిస్ధితుల్లోనే జెసి టిడిపి తీర్ధం పుచ్చుకున్నారు. ఎంపిగా గెలిచిన దగ్గర నుండి టిడిపిలోని జిల్లా నాయకత్వంతో పడటం లేదు. చంద్రబాబు వద్ద మాట సాగటం లేదు. పైగా పరిటాల సునీత రూపంలో అతిపెద్ద ప్రత్యర్ధి. దాంతో ఇంటా, బయట సమస్యలే. నియోజకవర్గ కేంద్రం ఎంఎల్ఏ ప్రభాకర్ చౌదరితో నిత్య యుద్ధమే.

ఈ నేపధ్యంలోనే జెసి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. మొన్నేమో పిలిస్తే జనాలు రావటానికి చంద్రబాబేమన్నా గాంధీ మహాత్ముడా అని ప్రశ్నించారు. పార్టీలో చాలా మంది కష్టపడ్డారని, ఒక్క చంద్రబాబు వల్లే పార్టీఅధికారంలోకి రాలేదన్నారు.

తాజాగా ఓ ఛానల్ తో మాట్లాడుతూ, టిడిపి కాళ్ళు, చేతులకి పక్షవాతం వచ్చిందన్నారు. ఒక్క తల (చంద్రబాబు) మాత్రమే పనిచేస్తోందని వ్యాఖ్యలు చేసారు. కాళ్ళు, చేతుల లాంటి ఎంఎల్ఏలు సక్రమంగా పనిచేయనపుడు తల వుండి మాత్రం లాభమేమన్నట్లుగా మాట్లాడారు.

జెసి చేసిన వ్యాఖ్యలతో టిడిపి నేతల్లో కాకపుట్టింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడూ సాహసం చేయలేరు. అటువంటిది జెసి తన ఇష్టం వచ్చినట్లు చంద్రబాబుపై సెటైర్లు వేస్తూంటే జెసిని ఆపలేకున్నారు. దాంతో జెసికి ఏ విధంగా బ్రేకులు వేయాలో అర్ధంకాక తలలు పట్టుకుంటున్నారు.