ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్థితులు
తిరుపతి: 2019 ఎన్నికల్లో వైసీపీకి జనసేన మద్దతివ్వనున్నట్టు ఆ పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ తనకు చెప్పారని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చెప్పారు.ఎన్నికల్లోనే జనసేన పవన్ కు మద్దతిస్తోందా, ఆ తర్వాత ఇస్తోందా అనే విషయాన్ని మాత్రం ఆయన స్పష్టం చేయలేదు.
శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఎన్నికల్లో టిడిపికి తాను మద్దతిస్తే టిడిపి ప్రజలకు ఏం చేయలేదని పవన్ కళ్యాణ్ తనతో చెప్పారని ఆయన గుర్తు చేశారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి తాను మద్దతు ఇవ్వనున్నట్టు పవన్ తనతో చెప్పారని వరప్రసాద్ గుర్తు చేశారు.
తమను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కమెడియన్లు అంటూ సంబోధించడం దారుణమని వరప్రసాద్ అభిప్రాయపడ్డారు. ప్రజల కోసం తాము నిరంతరం పనిచేస్తున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
2014 ఎన్నికల్లో టిడిపి, బిజెపి కూటమి అభ్యర్ధులకు జనసేన మద్దతుగా నిలిచింది. ఈ రెండు పార్టీల అభ్యర్ధులకు మద్దతుగా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించారు. అయితే నాలుగేళ్ళ కాలంలో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. రాష్ట్రంలోని అన్ని స్థానాలకు పోటీ చేయనున్నట్టు పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
