అమరావతి: అసెంబ్లీలో శుక్రవారం వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది జనసేన పార్టీ. బడ్జెట్ లో సంక్షేమానికి, అభివృద్ధికి మధ్య సమతుల్యత లేదని విమర్శించింది. సంక్షేమ పథకాల కేటాయింపులతోపాటు రాష్ట్ర ఆర్థిక ప్రగతి అనే అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని కేటాయింపులు చేసి ఉంటే బాగుండేదని విమర్శించారు. 

ఎన్నికల హామీ నవరత్నాల అమలుకు బడ్జెట్ లో కేటాయింపులు అయితే చేశారు గానీ అందుకు అవసరమైన నిధులు ఎకక్కడ నుంచి వస్తాయి అనే అంశంలోనూ క్లారిటీ లేదని ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్ లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో బడ్జెట్ పై పార్టీ సీనియర్ నేత, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మన్ చింతల పార్థసారధి మీడియాతో మాట్లాడారు. 

ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు రూ.500 కోట్లు కేటాయించడంపై మండిపడ్డారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.32వేల కోట్లు అవసరం అవుతుందని మిగిలిన నిధులు ఎక్కడ నుంచి తెస్తారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసింది.

ఇకపోతే రైతులకు సున్నా వడ్డీ రుణాలు అంటూ నానా హంగామా చేసిన ప్రభుత్వం కేవలం రూ.100కోట్లు కేటాయించడాన్ని తప్పుబట్టింది. ఆ డబ్బు ఎంతమందికి సరిపోతుందని ప్రశ్నించింది. కనీసం రూ.3వేల కోట్లు కేటాయిస్తే బాగుండేదంటూ సూచించింది.  

మరోవైపు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దివంగత సీఎం వైయస్ఆర్ పేరు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది జనసేన పార్టీ. టీడీపీ హయాంలో ఎన్టీఆర్ చంద్రన్న పథకాలు అంటూ ఊదరగొడితే, వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైయస్ఆర్ పేరుని తగలిలించిందని విరుచుకుపడ్డారు. 

అధికారంలో ఉన్నవారు మాత్రమే రాష్ట్ర అభివృద్ధి కోసం త్యాగాలు చేశారా అంటూ నిలదీశారు. దేశం కోసం, రాష్ట్రం కోసం త్యాగాలు వచేసిన వారు ఎంతోమంది ఉన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన మహనీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు.  కనీసం కొన్ని పథకాలకు అయినా అలాంటి మహానీయుల పేర్లు పెడితే బాగుంటుందని జనసేన పార్టీ సూచించింది.