3వ తరగతి పిల్లలకు టోఫెల్ ఏమాత్రం పనికిరాదు.. పేద పిల్లల పేరుతో వేల కోట్లు జేబులో వేసుకునే కుట్ర: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని వైసీపీ ప్రభుత్వంపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. తెనాలిలో నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ.. టోఫెల్ శిక్షణ పేరుతో ఈటీఎస్ అనే సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 1,040 కోట్లు దోచిపెట్టేందుకు సిద్దమైందని ఆరోపించారు. పేద పిల్లల పేరుతో వేల కోట్ల రూపాయాలను పక్కదారి పట్టించడానికి రంగం సిద్దం చేసుకుందని విమర్శించారు. పాఠశాల స్థాయిలో ఉన్న విద్యార్థులకు ఏ మాత్రం ఉపయోగపడని టోఫెల్‌ను బలవంతంగా రుద్దుతూ.. ఆ ముసుగులో వేల కోట్ల రూపాయలు జేబులో వేసుకునేందుకు వైసీపీ నేతలు రెడీ అయ్యారని విమర్శించారు.
టోఫెల్ పరీక్ష అనేది డిగ్రీ పూర్తయిన విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లాలని భావిస్తే.. ముఖ్యంగా అమెరికాకు వెళ్లేవాళ్లు ముందుగా వారి ఇంగ్లీష్ పరిజ్ఞానం తెలుసుకునేందుకు నిర్వహించే టెస్ట్ అని అన్నారు. అయితే జగన్ ప్రభుత్వం మాత్రం మూడు నుంచి పదో తరగతి చదివే పిల్లలకు ఈ ఏడాది నుంచి 2027 సంవత్సరం చివరి వరకు ఈ పరీక్షను నిర్వహించేలా ఈటీఎస్ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని విమర్శించారు. ఇందుకోసం నాలుగేళ్లలో రూ. 4 వేల కోట్ల పైనే ఖర్చు చేయనున్నారని.. ఈ ఒప్పందం వెనక వైసీపీ నాయకుల స్వలాభం దాగుందని ఆరోపించారు.
టోఫెల్ పరీక్ష మూడు తరగతి పిల్లలకు ఏ మాత్రం పనికిరాదని అన్నారు. పదో తరగతి విద్యార్థులు టోఫెల్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు అయినప్పటికీ.. వారికీ ఉపయోగం లేదని అన్నారు. వారు డిగ్రీ పూర్తి చేసే సరికి టోఫెల్ పరీక్ష ఉత్తీర్ణతకు ఉండే రెండేళ్ల గడువు పూర్తవుతుందని అన్నారు. ఇందుకోసం పిల్లలను కావాలని ఇబ్బంది పెట్టడం ఎందుకని ప్రశ్నించారు. అమెరికా ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 40 వేల మందికి మాత్రమే వీసాలు ఇస్తుంటే.. లక్షలాది మందికి శిక్షణ ఇప్పిస్తానని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న టోఫెల్ పథకంపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు.
ఎందరో విద్యార్థుల విదేశీ విద్య కలను తీర్చే అంబేద్కర్ విదేశీ విద్య పథకాన్ని వైసీపీ ప్రభుత్వం కుదించిందని మండిపడ్డారు. పేదలకు విదేశీ విద్య పేరిట దోపిడీకి తెరతీసిందని జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. జగనన్న విదేశీ విద్యా దీవెన కింద వైసీపీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో కేవలం 340 మందిని మాత్రమే విదేశాలకు పంపించిందని తెలిపారు. నాలుగేళ్లుగా ప్రజల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు బస్సు యాత్ర ద్వారా మరోసారి మోసానికి సిద్ధమైందని మండిపడ్డారు. బస్సు యాత్రలో జగన్ కూడా పాల్గొని రాష్ట్రంలో రోడ్ల దుస్థితిని ప్రత్యక్షంగా చూడాలని అన్నారు. కేవలం ప్రతిపక్ష నేతలను విమర్శించడం కోసమే సీఎం పర్యటనలు అని నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు చేశారు.