ఒక కుటుంబంలో వేరు వేరే పార్టీలకు ఓట్లు వేసే ఓటర్లు ఉండటం సర్వసాధారణం. కానీ.. ఇరు పార్టీలకు చెందిన ఇద్దరు నేతలు.. ఒకే కుటుంబ సభ్యులైతే.. అందులోనూ భార్య భర్తలైతే.. ఆ ఇల్లు ఓ రాజకీయ చదరంగంలా ఉంటుంది కదూ. ఇలాంటి సంఘటనే పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో చోటుచేసుకుంది.

భర్త ఏమో జనసేన తరపు నుంచి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాడు. భార్య టీడీపీ తరపున జడ్పీటీసీగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచింది. అయితే.. జనసేన అధినేత పవన్ కోరితే.. తన భార్యను టీడీపీకి రాజీనామా చేయిస్తానని చెబుతున్నాడు ఆ పార్టీ నేత బర్రె జయరాజు

బుధవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకర్లతో మాట్లాడుతూ పార్టీ టిక్కెట్‌ ఇస్తే తాను జనసేన తరుపున పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. జనసేన అధినేత ఎవరికి అవకాశం కల్పించినా వారి విజయానికి కృషి చేస్తానన్నారు. టిక్కెట్‌ ఆశించి పార్టీలో చేరలేదన్నారు. పవన్‌ సిద్ధాంతాలు, అభిమానం మీద ఆ పార్టీలో చేరానన్నారు. ఆయన ఆదేశించిన క్షణంలో నా భార్య వెంటక రమణ చేత టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేయిస్తానని విలేకర్లకు చెప్పారు.