తాడేపల్లిగూడెంలో టిడిపి-జనసేన కూటమి నిర్వహించిన భారీ బహిరంగసభకు ఎందురు హాజరుకాలేదో... ఆ సమయంలో తన పరిస్థితి ఎలా వుందో ఓ వీడియోను విడుదలచేసారు జనసేన నాయకులు నాగబాబు.
అమరావతి : తెలుగుదేశం-జనసేన కూటమి తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభతో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సభలో టిడిపి, జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు ఇరుపార్టీల కీలక నాయకులంతా పాల్గొన్నారు. కానీ పవన్ కల్యాణ్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు మాత్రం ఎక్కడా కనిపించలేదు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ బహిరంగ సభకు నాగబాబు గైర్హాజరు కావడం రాజకీయ చర్చకు దారితీసింది. దీంతో తాను తాడేపల్లిగూడెం సభకు ఎందుకు హాజరుకాలేకపోయారో నాగబాబే స్వయంగా వివరించారు.
తాడేపల్లిలో తెలుగు జన విజయకేతనం 'జెండా' సభకు సమాచార లోపం వల్లే హాజరుకాలేకపోయాయని నాగబాబు తెలిపారు. సభా నిర్వహణ బాధ్యతలు చూస్తున్నవారు తనను ముందుగానే చేరుకోవాలని సూచించారు... కానీ తాము కాస్త ఆలస్యంగా బయలుదేరామని అన్నారు. దీంతో అప్పటికే సభాప్రాంగణంతో పాటు దారిపొడవునా జన సైనికులు, టిడిపి శ్రేణులు నిండిపోయారు... వారిమధ్యలోంచి తాను ఆగిపోవాల్సి వచ్చిందన్నారు. భారీ ట్రాఫిక్ లో తన కారు ముందుకు వెళ్లలేకపోయింది... అందువల్లే వేదికపైకి చేరుకోలేకపోయానని నాగబాబు వెల్లడించారు.
రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?
అయితే తాను సభతో పాల్గొనలేనందుకు ఒకింత బాధగా వున్నా... టిడిపి-జనసేన సంయుక్తంగా నిర్వహించిన ప్రచారసభ దిగ్విజయం కావడం ఆనందాన్ని ఇచ్చిందన్నారు. సభా ప్రాంగణానికి కూడా వెళ్లలేనంతగా కిక్కిరిసిపోయిన జనసందోహంతో విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలాంటి భారీ బహిరంగ సభని ఎటువంటి ఆటంకాలకి తావులేకుండా నిర్వహించడంలో జనసేన నేత కేఎస్ఎస్ రావు కీలక పాత్ర పోషించారంటూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు నాగబాబు.
తాడేపల్లిగూడెం సభకు వెళుతుండగా తన కారు ట్రాఫిక్ లో చిక్కుకున్న వీడియోను నాగబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. సభకు వెళుతున్న టిడిపి, జనసేన శ్రేణులు వాహనాల మధ్య ఆగిపోయాయని తెలిపారు. సమయానికి సభా వేదిక వద్దకు చేరుకోలేకపోవడానికి ఇదే కారణమని నాగబాబు వివరించారు.
