అమరావతి: అమరావతిలోనే ఏపీ రాజధాని ఉండాలని జనసేన కోరుకొంటుంది. ఈ మేరకు ఇదే విషయాన్ని ఏపీ హైకోర్టులో జనసేన అఫిడవిట్ దాఖలు చేసింది.

అమరావతిపై తమ అభిప్రాయాలను చెప్పాలని రాజకీయ పార్టీలను ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్లు దాఖలు చేయాలని కోరింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 23వ తేదీన జనసేన తన అభిప్రాయాన్ని అఫిడవిట్ రూపంలో తెలిపింది.

మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ నిర్ణయానికి రాజ్యాంగ, న్యాయపరమైన ప్రాతిపదిక లేదని  జనసేన అభిప్రాయపడింది. మూడు రాజధానుల కోసం ప్రభుత్వం చట్టసభల సాంప్రదాయాలను , నిబంధనలను అతిక్రమించిందని జనసేన ఆరోపించింది. నిబంధనలకు విరుద్దంగా చట్టసభల్లో  బిల్లులను పాస్ చేసుకొన్నారని కూడ జనసేన విమర్శలు చేసింది.

ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్య రాజధాని అంశం వ్యక్తిగత గొడవగా మారిందన్నారు. విధానపరమైన నిర్ణయాలను రాజకీయాలు శాసించకూడదని ఆ పార్టీ అభిప్రాయపడింది. అమరావతిని రాజధానిగా ప్రకటించిన సమయంలో అన్ని రాజకీయ పార్టీలు మద్దతిచ్చిన విషయాన్ని జనసేన  ఈ సందర్భంగా గుర్తు చేసింది.

అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగిస్తూ 13 జిల్లాల అభివృద్ధి కోసం కృషి చేయాలని జనసేన కోరింది. రాజధాని నిర్మాణం కోసం రైతులు పెద్ద ఎత్తున భూములను త్యాగం చేశారని అఫిడవిట్ లో ఆ పార్టీ ప్రకటించింది.