భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

‘‘ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఊపిరి పోసుకున్న భారతీయ జనతా పార్టీ నేటికి నలభై వసంతాలు పూర్తి చేసుకుని 41వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి జనసేన పార్టీ తరుపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

Also Read:కరోనాపై మన నిర్ణయాలు ప్రపంచానికి ఆదర్శం: బీజేపీ కార్యకర్తలతో మోడీ

ఈ సందర్భంగా బీజేపీకి రూపకల్పన చేసిన మహనీయులు శ్రీ అటల్ బిహారి వాజ్‌పేయ్, ఎల్‌కే అద్వానీ, బైరాన్ షింగ్ షెకావత్ వంటి రాజకీయ యోధులకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాను. ఈ నాలుగు దశాబ్ధాల కాలంలో దేశం నలువైపులా విస్తరించిన బీజేపీ, ప్రజల పార్టీగా ఆవిర్భవించింది.

ఈ పార్టీ ఎన్నికల్లో సాధించిన విజయాలే ఇందుకు నిదర్శనం. వ్యవస్థాపక నేతల ఆశయాలను ముందుకు తీసుకెళ్తున్న ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షులు జేపీ నడ్డా ఇలా ఒకరేమిటి పార్టీలో అంతర్గతంగా పని చేస్తూ పార్టీని ప్రజలకు ముందుకు తీసుకెళ్తున్న ప్రతీ ఒక్కరికి శుభాభినందనలు తెలియజేస్తున్నాను’’ అంటూ పవన్ తెలిపారు.

Also Read:అన్న చిరుని పవన్ రిక్వెస్ట్ చేసి.. వాడేస్తారా?

మరోవైపు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ బీజేపీ కార్యకర్తలకు వినూత్నంగా పిలుపునిచ్చారు. కరోనా వైరస్‌పై పోరాడుతున్న వారికి సంఘీభావంగా కార్యకర్తలంతా ఒకపూట ఆహారం మానెయ్యాలని మోడీ సూచించారు.

బీజేపీని ఈ స్థాయికి తీసుకురావడంలో అనేక మంది కార్యకర్తలు కృషి చేశారని, వారి త్యాగ ఫలితంగానే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం లభించిందని ప్రధాని వ్యాఖ్యానించారు.