సారాంశం
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు బయల్దేరి వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయ్యింది . పవన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం వుందంటూ ఓ సీఐడీ అధికారి నుంచి అందిన సమాచారం ఆధారంగా బేగంపేట విమానాశ్రయం అధికారులు విమానాన్ని ఆపేసినట్లు తమకు తెలిసిందని జనసేన నేత కేవీఎస్ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు బయల్దేరి వెళ్లాల్సిన ప్రత్యేక విమానం రద్దయ్యింది. బేగంపేట విమానాశ్రయంలోనే విమానం నిలిచిపోవడంతో జనసైనికులు భగ్గుమంటున్నారు. వైసీపీ ప్రభుత్వం కుట్రపూరితంగా పవన్ విశాఖ పర్యటనను అడ్డుకుందని జనసేన ఆరోపిస్తోంది.
పవన్ వెళ్లాల్సిన విమానంలో సాంకేతిక లోపం వుందంటూ ఓ సీఐడీ అధికారి నుంచి అందిన సమాచారం ఆధారంగా బేగంపేట విమానాశ్రయం అధికారులు విమానాన్ని ఆపేసినట్లు తమకు తెలిసిందని జనసేన నేత కేవీఎస్ఎస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు చేసినా పవన్ కళ్యాణ్ విశాఖకు రావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల విశాఖలో జరిగిన అగ్నిప్రమాదంలో బోట్లను కోల్పోయిన మత్సకార కుటుంబాలకు పవన్ కల్యాన్ నష్టపరిహారం అందిస్తారని జనసేన నేతలు తెలిపారు.
ఇకపోతే.. సెప్టెంబర్ 9న కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానానికి బేగంపేట విమానాశ్రయంలో అనుమతి రద్దు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడంతో ఆయనను పరామర్శించేందుకు పవన్ బయల్దేరారు. అయితే పవన్ కల్యాణ్ రాష్ట్రంలో అడుగుపెడితే శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుందన్న కృష్ణా జిల్లా ఎస్పీ విజ్ఞప్తి మేరకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ అధికారులు ఆయన విమానం టేకాఫ్ కావడానికి అనుమతించలేదు. దీంతో పవన్ కల్యాణ్ రోడ్డు మార్గంలో విజయవాడకు బయల్దేరారు.