ప్రకాశం జిల్లా కురిచేడులో మద్యం బదులు శానిటైజర్ తాగి తొమ్మిది మంది మరణించిన ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన  ఆయన.. మద్యం నిషేధిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా నాటు సారా ఏరులై పారుతున్నా నిర్లిప్తంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

ఫలితంగా మద్యానికి బానిసలైన వాళ్లు ప్రాణాలు కోల్పోతున్నారని పవన్ మండిపడ్డారు. మత్తు కోసం నాటు సారా, శానిటైజర్ కలుపుకొని తాగారని క్షేత్ర స్థాయి నుంచి సమాచారం అందుతోందని జనసేన వ్యాఖ్యానించింది.

ఈ మరణాలపై సమగ్ర విచారణ చేపట్టాలని... కురిచేడులో చనిపోయినవారిలో ఎక్కువగా పేద కుటుంబాలవారే వున్నారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కుటుంబాలకు ప్రభుత్వం తగిన సహాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

Also Read:పదికి చేరిన శానిటైజర్ మృతుల సంఖ్య: జగన్ సీరియస్, ఎస్పీ పర్యటన

నాటు సారాను అరికట్టడంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని... ఈ విషయంలో నిర్లిప్తతకు తోడు మద్యం దుకాణాలను తెరిచి వుంచే సహాయం మరో గంటసేపు పొడిగించడం చూస్తుంటే ప్రభుత్వానికి మద్య  నిషేధంపై చిత్తశుద్ధి లేదని అర్థమవుతోందని పవన్ విమర్శించారు.

నాటు సారా సరఫరా పెరుగుతున్నా.. మద్యం దుకాణాల ముందు బారులు తీరి జనాలు ఉంటున్నా, మద్య విమోచన కమిటీ స్పందించడం లేదని జనసేనాని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డీ ఎడిక్షన్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అవి సమర్థంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.