ఒంగోలు: కరోనా కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లాలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాశం జిల్లాలోని కురిచేడు గ్రామంలో శానిటైజర్ కలిసిన కల్తీ సారా తాగి మరణించినవారి సంఖ్య పదికి చేరుకుంది.

ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరా తీశారు. కురిచెేడ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ కురిచేడులో పర్యటిస్తున్నారు. పది రోజులుగా వారు శానిటైజర్ తాగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. 

మృతుల్లో ముగ్గురు భిక్షాటన చేస్తూ జీవించేవారు కాగా, మరో నలుగురు గ్రామస్తులు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా మద్యం సరఫరా నిలిపేయడంతో మందబాబులు శానిటైజర్లు తాగుతున్న ఘటనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి.

శానిటైజర్ తాగడం వల్ల గొంతు ఎండిపోయి వారు మరణించి ఉంటారని భావిస్తున్నారు. స్థానిక పోలేరమ్మ గుడి వద్ద రేకుల షెడ్డులో ఓ యాచకుడ గురువారం సాయంత్రం మరణించాడు. మరో వ్యక్తి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో 108 వైద్య సిబ్బంది దర్శి వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ అతను మరణించాడు. మిగతా ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.