Asianet News TeluguAsianet News Telugu

నీ బాగోతాలన్నీ తెలుసు.. ఖైదీ నెం 6093కి సెల్యూట్ కొట్టలేను, నేనే పోలీస్‌నైతే చచ్చిపోతా : జగన్‌పై పవన్ వ్యాఖలు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పవన్ కల్యాణ్ టార్గెట్ చేశారు. ఆయనను మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ వ్యాఖ్యానించిన పవన్.. ఖైదీ నెంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం తన వల్ల కాదని, పోలీసునైతే చచ్చిపోతానన్నారు. 

janasena chief pawan kalyan slams ap cm ys jagan
Author
First Published Jan 12, 2023, 7:49 PM IST

జైలుకెళ్లిన ఖైదీ నెంబర్ 6093 కూడా తన గురించి మాట్లాడితే ఎలా అంటూ జగన్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఖైదీ నెంబర్ 6093కి సెల్యూట్ కొట్టడం తన వల్ల కాదని, పోలీసునైతే చచ్చిపోతానన్నారు. మూడు సార్లు కూడా తాను విడాకులు ఇచ్చే పెళ్లిళ్లు చేసుకున్నానని పవన్ తెలిపారు. దేశంలో పూర్తి స్థాయి రాజకీయ నాయకుడు ఎవరూ లేరని.. అంతా వ్యాపారాలు , కాంట్రాక్ట్‌లు చేసే రాజకీయ నాయకులేనని పవన్ పేర్కొన్నారు. అసలే రెండు ముక్కలైన రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే కుతంత్రాలు చేస్తున్నారని పవన్ ఆరోపించారు. ఇది మూడు ముక్కల ప్రభుత్వం, ఆయన మూడు ముక్కల ముఖ్యమంత్రి అంటూ జగన్‌పై సెటైర్లు వేశారని ఆయన దుయ్యబట్టారు. ఏం చేస్తావు నువ్వు.. దిగొచ్చావా అంటూ పవన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

రెండు చోట్లా ఓడిపోయానని అన్నా, యుద్ధం తాలూకు గాయాలుగానే తీసుకున్నానని.. కానీ ఓటమిగా తీసుకోలేదని పవన్ అన్నారు. కాపులు తన పక్కన నిలబడకపోయినా , తాను ఓడినా, కులాల మధ్య చిచ్చు పెట్టనని ఆయన స్పష్టం చేశారు. తన ఎదురుగా వచ్చి ప్యాకేజీ తీసుకున్నానని అంటే.. తానేం చేస్తానో చెబుతానని పవన్ హెచ్చరించారు. ఇంకోసారి ప్యాకేజీ అంటే .. తన జన సైనికుడి చెప్పు తీసుకుని కొడతానని ఆయన అన్నారు. తాను బతికున్నంత వరకు వైసీపీ గుండాలతో యుద్ధం చేస్తూనే వుంటానని పవన్ స్పష్టం చేశారు. తనను గురించి మాట్లాడేవాళ్లను , తాను మర్చిపోనని.. తన వాళ్లు మర్చిపోరని ఆయన హెచ్చరించారు. తాను కులం కోసం వచ్చిన వాడిని కాదని.. తన తెలుగునేల, తన దేశం బాగుండాలని వచ్చానని పవన్ స్పష్టం చేశారు. 

ALso REad: మూడు ముక్కల ప్రభుత్వం, మూడు ముక్కల ముఖ్యమంత్రి.. నేను భయపడాలా : జగన్‌పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు

తాను ఎవరినో తిట్టడానికి ఈ సభ పెట్టలేదన్నారు జనసేన అధినేత . ప్రతి వెధవ, సన్నాసి చేత తాను ఇవాళ మాటలు పడుతున్నానని పవన్ తీవ్రవ్యాఖ్యలు చేశారు. అయినప్పటికీ తనకు ఆ బాధ లేదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాల్లోకి రాకపోతే.. తనను తిట్టే వాళ్లు కూడా తనతో ఫోటోలు దిగేవాళ్లేనని పవన్ అన్నారు. ప్రజల పక్షాన నిలబడి తిట్టించుకోవడం కూడా తాను విజయంగానే భావిస్తానని జనసేనాని స్పష్టం చేశారు. తన కోసం కాకుండా , తన సాటి మనిషి కోసం జీవించే జీవితం గొప్పదని ఆయన అన్నారు. అధికారంలోకి రాగానే ప్రజల్ని బానిసల్లా చూసే వ్యక్తిత్వాలు తనకు చిరాకని పవన్ అన్నారు.

సమాజం, దేశం కోసం ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని జనసేనాని స్పష్టం చేశారు. మహా అయితే ప్రాణం పోతుందని.. కానీ ఒక సత్యాన్ని బలంగా మాట్లాడిన వాడినవుతానని పవన్ అన్నారు. యువతలో కోపం వుంది, కానీ భయం కూడా వుందని ఆయన పేర్కొన్నారు. రాజకీయ నేతలకు భయపడనక్కర్లేదని పవన్ స్ఫష్టం చేశారు. ఇది కళింగాంధ్ర కాదని.. కలియబడే ఆంధ్ర అన్న ఆయన.. మీరు మౌనంగా వుంటే ఎలా అని ప్రశ్నించారు. పోరాటం చేయడం, వెధవల్ని ఎదుర్కోవడం తనకు బాగా తెలుసునని పవన్ స్పష్టం చేశారు. తన చివరి శ్వాస వరకు రాజకీయాలను వదలనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. గూండాగాళ్లను ఎలా తన్నాలో తనకు తెలుసునని ఆయన వ్యాఖ్యానించారు. తన సభలకు వచ్చే యువతను చూసి మార్పు వస్తోందని అనుకున్నానని.. కానీ ఓట్లు వేసే సమయానికి అంతా తనను వదిలేశారని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు పవన్ కల్యాణ్. రాజు సరైనోడు కాకపోతే సగం రాజ్యం నాశనమవుతుందని.. సలహాలిచ్చేవాడు సజ్జల అయితే పూర్తిగా నాశనమవుతుందని ఆయన సెటైర్లు వేశారు. యువత కోసం తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమని పవన్ స్పష్టం చేశారు. ఉత్తరాంధ్రను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ వుందని వైసీపీ నేతలు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నాయకుడు మీరు ఊరిని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించుకోండి అంటూ పవన్ ఎద్దేవా చేశారు. 26 జిల్లాలను 26 రాష్ట్రాలుగా ప్రకటించుకోవాలంటూ ఆయన చురకలంటించారు. 

మీ కుటుంబాలు పాలన చేస్తే, ప్రజలు బానిసల్లా వుంటారని.. రాష్ట్ర విభజన సమయంలో మంత్రులు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. పదవులు లేకపోతే రాష్ట్రాన్ని ముక్కలు చేసేస్తారా అంటూ ఆయన ఆగ్రహ వ్యక్తం చేశారు. పదవులు లేకపోతే దేశాన్ని కూడా రెండు ముక్కలు చేసేయాలంటూ పవన్ ఫైర్ అయ్యారు. మీరు చేస్తా వుంటే.. మేం చూస్తా వుంటామని అనుకుంటున్నారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని, రాష్ట్రాల్ని మీరు ముక్కలు చేస్తామంటే.. మిమ్మల్ని ముక్కలు చేస్తామంటూ పవన్ హెచ్చరించారు. 1280 ఎకరాల్లోని ఆస్తుల్ని తాకట్టు పెడితే ఉత్తరాంధ్రపై ధర్మానకు ఉన్న ప్రేమ ఏమైందని ఆయన ప్రశ్నించారు. సైనికులకు ప్రభుత్వం స్థలం ఇస్తే దాన్ని కాజేసిన మహానుభావుడు ధర్మాన అంటూ పవన్ ఆరోపించారు. వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడితే.. మీతో పోలీస్తే తాను దేవుణ్ణి అంటూ జనసేనాని సెటైర్లు వేశారు. తన కాళ్లకు దండం పెడితే, ఆశీర్వదిస్తానంటూ ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios