మహిళలకు భద్రత కల్పించడంతో జగన్ సర్కార్ పూర్తిగా విఫలమైందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేసారు. 

మంగళగిరి : ఆంధ్ర ప్రదేశ్ లో వేలాదిమంది మహిళలు అదశ్యమైనా వైసిపి ప్రభుత్వం గాని, సీఎం వైఎస్ జగన్ గానీ పట్టించుకోవడం లేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. తమ బిడ్డలు ఏమయ్యారో తెలీక తల్లులు తల్లడిల్లిపోతున్నారని అన్నారు. ఒక తల్లి బాధ తీర్చలేనప్పుడు 151 సీట్లు వచ్చి ఏం ప్రయోజనం అంటూ సీఎం జగన్ కు పవన్ చురకలు అంటించారు. 

77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసారు పవన్ కల్యాణ్. అనంతరం జనసేన వీర మహిళలతో ప్రత్యకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో మహిళల భద్రతపై జనసేనాని ఆందోళన వ్యక్తం చేసారు. 

స్త్రీ శక్తిని ప్రతిఒక్కరూ గౌరవించాలని... అందుకోసమే ఈరోజు మహిళలతో సమావేశం పెట్టానని పవన్ కల్యాణ్ తెలిపారు. ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే రాజకీయ పార్టీ పెట్టి నడపగలుగున్నానని అన్నారు. ఆడబిడ్డలకు విసిపి పాలనలో రక్షణ లేకుండా పోయిందని... ఏకంగా 30 వేల మంది మహిళలు కనిపించకుండాపోతే తమకేమీ పట్టనట్లుగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. 150 మంది పిల్లలను హ్యూమన్ ట్రాఫికింగ్ ద్వారా తీసుకెళ్లిపోయినా ఏ చర్యలు లేవన్నారు. మహిళల అదృశ్యం, పిల్లల హ్యూమన్ ట్రాఫికింగ్ పై సీఎం జగన్ గానీ, సంబంధిత మంత్రి గానీ ఒక్క సమీక్ష కూడా జరపలేదు... ఇదీ వీరికి మహిళా భద్రతపై వున్న శ్రద్ద అంటూ పవన్ ఎద్దేవా చేసారు. 

జనసేనలో మహిళలకు సముచిత స్థానం వుంటుందని పవన్ అన్నారు. ఆడపడుచులకు మానప్రాణాలకు రక్షణ కల్పిస్తామని అన్నారు. మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని పవన్ స్పష్టం చేసారు. 

Read More మంత్రులకు మతి తప్పినట్టుంది.. లేకపోతే అతడిని భగవంతుడితో పోలుస్తారా??... రఘురామ

తాడేపల్లిలో క్రైమ్ రేటు ఎక్కువగా ఉందంటూ పవన్ ఆందోళన వ్యక్తం చేసారు. ముఖ్యంగా మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువయ్యాయని... వీటిపై మహిళా మంత్రులు, మహిళా కమిషన్ మాట్లాడదని అన్నారు. కానీ తనను తిట్టడానికి మాత్రం వీరు ముందుంటారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు. 

ఎవరి బలిదానం త రాష్ట్రం ఏర్పడిందో వారికి గుర్తింపు లేకుండా పోయిందన్నారు. సీఎం జగన్ చివరకు తన తండ్రికి కూడా గుర్తింపు ఇవ్వడానికి ఇష్టపడటం లేదన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక భవనాలు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పక్కా సీఎం ఫోటో వుండాల్సిందు... కానీ రాష్ట్రంలోకి బలిదానాలు చేసిన వారి ఫోటోలు ఉండదన్నారు. ఇదేనా ముఖ్యమంత్రి మహనీయులకు ఇచ్చే గౌరవం అంటూ పవన్ మండిపడ్డారు. 

ప్రస్తుతం ఏపీలో జగన్ పాలన అస్తవ్యస్తంగా సాగుతోందని పవన్ అన్నారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని వదిలి పారిపోతామని చాలామంది అంటున్నారని... పుట్టిపెరిగిన నేలను వదిలేసి ఎక్కడికి పారిపోతాని ప్రశ్నించారు. వ్యవస్థలను నాశనం చేసే వ్యక్తులను ముఖ్యమంత్రి పదవి నుండి దించేయాలని పవన్్ సూచించారు. 

Read More సినిమాల్లో పవన్ హీరో , నిజ జీవితంలో జగన్ హీరో: జనసేనానిపై మంత్రి గుడివాడ ఫైర్

జనసేన పార్టీ త్వరలోనే 'ప్రజా కోర్టు' కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని... అందులో మొదటి ముద్దాయిగా వైసీపీ నిలబడుతుందని పవన్ అన్నారు. అన్యాయాలు,ఆక్రమణలు,ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం చేసే వాటిని బయటపెడితే నగదు ప్రోత్సాహకాలు అందిస్తామని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కులం,మతం చూసి ఓటేస్తే మీ బిడ్డల భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు. వచ్చే ఎన్నికల్లో సరైన వ్యక్తిని ఎన్నుకొకపోతే సమస్యలు తప్పవని పవన్ హెచ్చరించారు. 

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపడానికి శతవిధాలుగా ప్రయత్నిస్తున్నానని పవన్ అన్నారు. జనసేన అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఇస్తున్న పథకాల కంటే ఎక్కువే ఇస్తానని...పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని సద్వినియోగం చేస్తానని జనసేన అధ్యక్షులు పవన్ వెల్లడించారు.