Asianet News TeluguAsianet News Telugu

అంతర్వేది నూతన రథ నిర్మాణం... వారికి ప్రాధాన్యతేది: సర్కార్ ను నిలదీసిన పవన్

అంతర్వేది లక్ష్మీ నారసింహుడిని  అగ్నికుల క్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారు కాబట్టి నూతన రధం తయారీలో వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ ప్రభుత్వాన్ని కోరారు. 

Janasena chief pawan kalyan rects new chariot construction in antarvedi
Author
Antarvedi, First Published Sep 24, 2020, 1:30 PM IST

విజయవాడ: అంతర్వేది లక్ష్మీనారసింహుని ఆలయానికి నూతన రథం నిర్మించి ఇవ్వటానికి సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం ఆలయ సంప్రదాయాలు, స్థానికుల మనోభావాలను కూడా పరిగణలోకి తీసుకోవాలని జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ సూచించారు. అంతర్వేది లక్ష్మీ నారసింహుడిని  అగ్నికుల క్షత్రీయులు తమ కుల దైవంగా పూజిస్తుంటారు కాబట్టి నూతన రధం తయారీలో వారి సలహాలు, సూచనలు తీసుకోవాలని పవన్ కోరారు. 

''అంతర్వేది ఆలయాన్ని అగ్నికుల క్షత్రీయుడైన కొపనాతి కృష్ణమ్మ నిర్మించిన సంగతి యావన్మందికి  విదితమే. తొలి రథం కూడా కృష్ణమ్మ రూపొందించినదే. శిథిలావస్థకు చేరిన ఆ రథం స్థానంలో ఇటీవల అగ్నికి ఆహుతి అయిన రథం కూడా స్థానిక అగ్నికుల క్షత్రీయులు తయారుచేసినదే. అయితే ఇప్పుడు కొత్త రథం నిర్మాణంలో తమకు ప్రాధాన్యత లేకపోవడంపై అగ్నికుల క్షత్రీయ సంఘం ఆవేదన చెందుతూ నాకు ఒక లేఖ రాశారు'' అని పవన్ తెలిపారు. 

read more   ఇచ్చిన మాటకు కట్టుబడిన పవన్ కళ్యాణ్: మూడు రాజధానులపై తేల్చేసిన జనసేనాని

''తనకు రాసిన లేఖలో అగ్నికుల క్షత్రియులు పేర్కొన్న అంశాలు సహేతుకంగా వున్నాయి. రథం రూపకల్పన కమిటీలో అగ్నికుల క్షత్రీయలకు ప్రాతినిధ్యం లేకపోవడం శోచనీయం. అదే విధంగా ఈ రథం తయారీని వేరే రాష్ట్రంలోని వారికి అప్పగించారని, అయితే అంతకన్నా తక్కువ మొత్తానికే రథాన్ని రూపొందించగలిగిన వారు తమలో వున్నారని, అందువల్ల ఆ బాధ్యతలు తమకే అప్పగించాలని వారు కోరుతున్నారు. అందువల్ల వారి ప్రతిపాదనను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి'' అని డిమాండ్ చేశారు. 

''ఆలయ సంప్రదాయాలు, ఆలయంతో ముడిపడివున్న వారి మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అగ్నికుల క్షత్రీయ సంఘంతో చర్చించి వారి ఇలవేల్పైన లక్ష్మీనారసింహునికి సంబంధించిన నూతన రథం రూపకల్పనలో వారిని భాగస్వామ్యుల్ని చేయవలసిన భాధ్యత  ప్రభుత్వంపై వుంది. ఎందుకంటే రథోత్సవం నాడు తొలి కొబ్బరికాయ కొట్టి రథాన్ని లాగేది అగ్నికుల క్షత్రీయులే  అయినందున వారి మనోభావాలను గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది'' అంటూ పవన్ కల్యాణ్ ఓ ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని కోరారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios