అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై వైసీపీ నాయకులు ఇచ్చిన వీడియో ప్రజేంటేషన్‌పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వైసీపీ నేతలు ఇన్‌సైడర్ ట్రేడింగ్ అంటూ పదే పదే చెబుతున్నారని అధికారం మీ చేతుల్లో ఉన్నప్పుడు చర్యలు తీసుకోవచ్చు కదా అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

అప్పట్లో అమరావతిని రాజధానిగా జగన్ అంగీకారం తెలిపారని.. ఇప్పుడు మూడు రాజధానులు అంటున్నారని పవన్ విమర్శించారు. ఇప్పుడు నిర్ణయించే రాజధాని అయినా అందరి ఆమోదంతోనే ఏర్పాటు చేయాలని జనసేనాని హితవు పలికారు.

Also Read:రేపు బోస్టన్ కన్సల్టెన్సీ నివేదిక: గవర్నర్‌తో జగన్ భేటీ, అమరావతిలో తీవ్ర చర్చ

రాజధానిపై ఇంకా కాలయాపన చేయడం తగదని, ప్రభుత్వం తక్షణమే అధికారిక ప్రకటన చేయాలని పవన్ డిమాండ్ చేశారు. వైసీపీ నేతల ప్రకటనలు ప్రజల్ని గందరగోళానికి గురిచేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. పాలకుల నిర్ణయాలతో అమరావతి ప్రాంతం త్రిశంకు స్వర్గంలా మారిపోయిందని పవన్ వాపోయారు.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి మాట్లాడుతూ... అమరావతిపై భువనేశ్వరికి అంత జాలి ఎందుకంటూ ధ్వజమెత్తారు.

గోదావరి పుష్కరాల్లో 30 మంది చనిపోతే జాలి ఎందుకు కలగలేదన్నారు. తండ్రిని వెన్నుపోటు పొడిచినప్పుడు కూడా జాలి కలగలేదా అని అంబటి ప్రశ్నించారు. భువనేశ్వరికి రైతులపై జాలా... లేక అమరావతి భూములపైనా.. అంటూ ఆయన ఆరోపించారు.

రాజధానిలో హత్యలు చేసి వాటిని ఆత్మహత్యలుగా చిత్రీకరించే ప్లాన్ నడుస్తోందని రాంబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాజధానిని మూడుగా విభజించామని, అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని అంబటి స్పష్టం చేశారు.

నిజమైన రైతులకు జవాబుదారీగా ఉంటామని, బోస్టన్ రిపోర్టు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. చంద్రబాబు శివరామకృష్ణన్ రిపోర్టును పక్కన పెట్టిందని.. సీఆర్డీఏ చట్టం అనంతరం శివరామకృష్ణన్ దానిని తప్పుబట్టిన సంగతిని రాంబాబు గుర్తుచేశారు.

Also Read:అప్పుడు కలగని జాలి.. అమరావతిపై ఎందుకు: భువనేశ్వరిని ప్రశ్నించిన అంబటి

రాజధాని పేరుపై అనేక అక్రమాలు జరిగాయని... తక్కువ రేట్లకు రాజధానిలో భూమలు కొనుగోలు చేశారని రాంబాబు ఆరోపించారు. ల్యాండ్ పూలింగ్ భూములకు బదులు ఇచ్చే ప్లాట్లలో కూడా అవినీతి జరిగిందని.. రాజధాని నూజివీడు దగ్గర అంటూ తప్పుడు సమాచారం పంపారని అంబటి దుయ్యబట్టారు.

అమరావతి ప్రకటనకు ముందు పెద్దఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని, మొత్తం 4069.95 ఎకరాలు రాజధానిలో కొనుగోలు చేశారని అంబటి తెలిపారు.