ఆంధ్రప్రదేశ్ గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్మోహన్ రెడ్డి గురువారం భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చ జరిగింది. ప్రధానంగా రాజధాని తరలింపు, మూడు రాజధానుల అంశంపై ముఖ్యమంత్రి జగన్.. గవర్నర్‌కు వివరించారు.  

త్వరలోనే రాష్ట్రంపై జరుగుతున్న పరిణామాలు, రాజధాని మార్పుపై గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా గవర్నర్‌ను కలిశారు. రాయలసీమలో హైకోర్టు, రాజధాని మార్పుపై చర్చించారు.

Also Read:అప్పుడు కలగని జాలి.. అమరావతిపై ఎందుకు: భువనేశ్వరిని ప్రశ్నించిన అంబటి

అమరావతి ప్రాంత రైతులు కూడా గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి, తమ ఆవేదనను వ్యక్తం చేశారు. రాజధానిగా అమరావతిని కొనసాగించేలా చేయాలని వారు గవర్నర్‌కు తెలిపారు. రేపు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ రాజధానిపై నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలో గవర్నర్‌ను సీఎం జగన్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే సంకేతాలను అసెంబ్లీ వేదికగా గత ఏడాది చివర్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చారు. దీంతో అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ 16 రోజులుగా రాజధాని రైతులు ఆందోళన చేస్తున్నారు. రాజధాని రైతులకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి

Also Read:బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ నివేదిక సిద్దం: అమరావతిపై జగన్ సర్కార్ తాడోపేడో

ఏపీ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ఇప్పటికే జీఎన్ రావు కమిటీ ఏపీ ప్రభుత్వానికి నివేదికను ఇచ్చింది. బోస్టన్ కన్సల్టెన్సీ కమిటీ ఈ నెల 3వ తేదీన నివేదికను ఇవ్వనుంది. ఈ రెండు నివేదికలను అధ్యయనం చేసేందుకు హై పవర్ కమిటీని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ కమిటీలో మంత్రులతో పాటు అధికారులు కూడ సభ్యులుగా ఉన్నారు

రాజధాని అంశంపై రెండు కమిటీలతో పాటు హైపవర్ కమిటీతో ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ నెల 8వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. గత ఏడాది చివర్లో కేబినెట్ సమావేశంలోనే రాజధాని అంశంపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంటుందనే ప్రచారం సాగింది. కానీ, ఆ సమావేశంలో మాత్రం రాజధానిపై మాత్రం తొందరపాటు లేదనే అభిప్రాయాన్ని జగన్ మంత్రులకు చెప్పినట్టుగా ప్రచారం సాగింది