చిత్తూరు జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డుప్రమాదంపై టిడిపి చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తో పాటు అచ్చెన్నాయుడు,శైలజానాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు.
అమరావతి: చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని భాకరాపేటలో రాత్రి చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం జగన్ తో పాటు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఏపి కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. శుభకార్యానికి వెళుతుండగా బస్సు లోయలో పడిపోవడంతో ఎనమిదిమంది చనిపోగా మరో 45మంది తీవ్ర గాయాలపాలవడంపై వీరు విచారం వ్యక్తం చేసారు.
తన సొంత జిల్లాలో జరిగిన ఈ ఘోర బస్సు ప్రమాదంపై టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. ఆనందంగా నిశ్చితార్థానికి వెళుతుండగా బస్సు లోయలో పడిపోయిన దుర్ఘటనలో 8మంది ప్రాణాలు కోల్పోవడం విచారకరమని అన్నారు. ఆనందోత్సాహాలతో కళకళలాడాల్సిన పెళ్లింట ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు.
ఈ ప్రమాదంలో గాయపడిన వారికి ప్రభుత్వమే మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. క్షతగాత్రులంతా త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని... మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని చంద్రబాబు అన్నారు.
ఇక చిత్తూరు ప్రమాదంపై సినీ హీరో, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. ఎంతో సంతోషంతో నిశ్చితార్థం వేడుకలకు అనంతపురం జిల్లా ధర్మవరం నుంచి తిరుచానూరుకు వెళుతున్న బృందం ప్రమాదానికి గురై ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోవడం... చాలా మంది తీవ్రంగా గాయపడడం మనసును తీవ్రంగా కలచి వేసిందన్నారు. గాయపడినవారిలో కొందరి పరిస్థితి ఆందోళకరంగా ఉండడం మరింత విషాదకరమని పవన్ ఆవేదన వ్యక్తం చేసారు.
చిత్తూరు జిల్లా భాకరాపేట ఘాట్ రోడ్డులో పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ బస్సు లోయలోకి బోల్తాకొట్టి ప్రమాదం సంభవించగా చాలాసేపటి వరకు ఈ ప్రమాదాన్ని ఎవరూ గుర్తించలేదని తెలిసి భాద అనిపించిందన్నారు. ఆ సమయంలో సహాయం అందక క్షతగాత్రులు ఎంత వేదన అనుభవించారో ఊహిస్తేనే గుండె భారంగా మారుతోందన్నారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారని.... ఇది దురదృష్టకరమన్నారు. ఇటువంటి బస్సుల యాజమాన్యంపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి... లేనిపక్షంలో మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు.
బస్సులకు స్పీడ్ కంట్రోల్స్ ను తక్షణం అమర్చే చర్యలు చేపట్టడంతో పాటు ఘాట్ రోడ్లలో రక్షణ గోడలను పటిష్టపరచాలన్నారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, గాయపడినవారికి తగినంత నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందివ్వాలన్నారు. గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మలకు శాంతి చేకూరాలని... మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని పవన్ కల్యాణ్ అన్నారు.
బాకరపేట ఘాట్ రోడ్డు బస్సు ప్రమాదంలో టిడిపి ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 8 మంది మృతి చెందటం తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. సంతోషంగా వివాహం జరుగుతున్న కుటుంబంలో విషాదం నిండటం బాధాకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించడంతో పాటు భాదిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు. ఇకనైనా ప్రభుత్వం రహదారుల భద్రతపై దృష్టి సారించాలని.. భవిష్యత్తు లో ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని అచ్చెన్నాయుడు సూచించారు.
ఇక చిత్తూరు బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ సాకే శైలజానాథ్ శైలజనాథ్ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
