Asianet News TeluguAsianet News Telugu

రోజుకు 10 వేల కేసులొస్తున్నాయి.. మూడు రాజధానులు ముఖ్యమా: ప్రభుత్వంపై పవన్ ఫైర్

పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలను కరోనా మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. 

janasena chief pawan kalyan reacts governor approves crda and ap decentralisation bill
Author
Amaravathi, First Published Jul 31, 2020, 8:52 PM IST

పరిపాలనా వికేంద్రీకరణ, మూడు రాజధానుల బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలపడంపై స్పందించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ప్రజలను కరోనా మహమ్మారి పీడిస్తున్న నేపథ్యంలో మూడు రాజధానుల నిర్ణయానికి ఇది సరైన సమయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అమరావతికి 33 వేల ఎకరాలు అవసరం లేదని ఎంతోమంది చెప్పినా తెలుగుదేశం ప్రభుత్వం వినిపించుకోలేదని పవన్ దుయ్యబట్టారు. కొత్త రాజధానిగా ఆవిర్భవిస్తున్న అమరావతిని అద్భుతంగా నిర్మించడానికి 33 వేల ఎకరాలు కావాల్సిందేనని నాటి ప్రతిపక్షనేత జగన్ అసెంబ్లీలో చాలా గట్టిగా మాట్లాడారని జనసేనాని గుర్తుచేశారు.

రాజధానిని వచ్చే ప్రభుత్వాలు ముందుకు తీసుకెళ్లకపోతే రైతుల పరిస్ధితి ఏంటని ప్రశ్నించింది ఒక్క జనసేన మాత్రమేనని పవన్ గుర్తుచేశారు. రాజధానికి 33 వేల ఎకరాలు అవసరం లేదని కూడా తామే చెప్పామని.. అప్పుడు తమ మాట వినుంటే ఇప్పుడు రైతులు కన్నీరు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడేది కాదని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.

సీనియర్ రాజకీయ వేత్త వడ్డే శోభనాద్రీశ్వరరావు చెప్పినట్లు గత ప్రభుత్వం నేలను విడిచి సాము చేసిందని, దీనికి తోడు నాడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ వంత పడిందని పవన్ ఆరోపించారు.

రెండు బిల్లులు గవర్నర్ ఆమోదం పొందిన నేపథ్యంలో రైతుల పరిస్థితిపై పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో చర్చించి భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామని ఆయన చెప్పారు. రైతుల పక్షాన తుది వరకు జనసేన ఉంటుందని పవన్ హామీ ఇచ్చారు.

ప్రస్తుతం రోజుకు పదివేల కేసులు నమోదవుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రాణాలు అరచేత పెట్టుకుని భయాందోళనతో ఉన్నారని జనసేనాని చెప్పారు. ఇలాంటి పరిస్దితుల్లో మూడు రాజధానుల ఏర్పాటుపై కాకుండా వైరస్ నుంచి ప్రజలను రక్షించడానికి రాష్ట్ర మంత్రివర్గం, ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి పెట్టాలని పవన్ హితవు పలికారు. 

Follow Us:
Download App:
  • android
  • ios