తిరుపతిలో పవన్ భారీ ర్యాలీ.. సీఐ అంజూ యాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేయనున్న జనసేనాని..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. ఇటీవల శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయిపై దాడి చేసిన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) అంజు యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన తిరుపతి జిల్లా ఎస్పీకి వినతిపత్రం సమర్పించనున్నారు. అయితే ఈరోజు ఉదయం విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్‌కు జనసైనికులు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా తిరుపతి ఎస్పీ కార్యాలయానికి బయలుదేరారు. ర్యాలీగా ముందుకు సాగుతున్న పవన్ కల్యాణ్ వెంట భారీగా పార్టీ శ్రేణులు ఉన్నారు. సీఐ చేతిలో దాడి గురైన సాయితో పాటు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నేతలతో కలిసి పవన్ కల్యాణ్ ఎస్పీని కలిసి.. సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే ఉదయం 10.30 గంటలకే పవన్ కల్యాణ్.. జిల్లా ఎస్పీని కలవనున్నట్టుగా జనసేన పార్టీ తెలిపినప్పటికీ భారీ ర్యాలీ కారణంగా అది మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది.
ఇక, ఇదివరకే ఈ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్.. శాంతియుతంగా ధర్నా చేయడం ప్రజాస్వామ్యంలో హక్కు అని పేర్కొన్నారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్నవారిని కొట్టే హక్కు ఏ పోలీసు అధికారికి లేదని అన్నారు. తానే శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాకు వస్తానని.. అక్కడే తేల్చుకుందామని అన్నారు. తమ వాళ్లను ఎందుకు కొట్టారని ప్రశ్నించారు. తమ నాయకుడిని కొడితే.. తనను కొట్టినట్టేనని తప్పకుండా అక్కడికే వస్తానని చెప్పారు. పోరాడితే పోయేదేమి లేదు.. బానిస సంకెళ్లు తప్ప అని పవన్ పేర్కొన్నారు.
శాంతియుతంగా ఉన్న తమ పార్టీ నాయకుడిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని తిరుపతి జిల్లా ఎస్పీ ద్వారా పోలీసు డైరెక్టర్ జనరల్ (డీజీపీ)కి ఫిర్యాదు చేయాలని పార్టీ నాయకత్వం నిర్ణయించిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల ఇది వరకే ప్రకటించారు.
అసలేం జరిగిందంటే..
జనసేన అధినేత పవన్ కల్యాణ్ వాలంటీర్ల వ్యవస్థపై చేసిన కామెంట్స్‌కు వ్యతిరేకంగా వైసీపీ నేతలు, వాలంటీర్లు నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కల్యాణ్‌కు మద్దతుగా.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనసేన శ్రేణులు కూడా రోడ్ల మీదకు వచ్చారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో నిరసన చేపట్టిన జనసేన శ్రేణులు.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడ స్థానిక జనసేన నేత సాయిపై అంజు యాదవ్ చేయి చేసుకున్నారు. చెంప దెబ్బ కొట్టారు. దీంతో పోలీసులకు, జనసేన శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అందులో సీఐ అంజూ యాదవ్ తన రెండు చేతులతో ఆ వ్యక్తిని కొట్టడం కనిపించింది. సీఐ అంజూ యాదవ్ తీరును జనసేన నేతలు ఖండించారు. ఆమె వైసీపీ కార్యకర్తలా ప్రవర్తించారని ఆరోపించారు.