కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆలస్యమవుతున్నాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. రైల్వే పనులకు నిధులు ఇవ్వరని.. భూసేకరణ చేయరని, ఈ విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.
వైఎస్ జగన్ (ys jagan) సర్కార్‌పై జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ (pawan kalyan) ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకమైన రైల్వే లైన్ల (railway lines) నిర్మాణం, విస్తరణలపై రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్‌లో కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ (indian railways) ఇచ్చిన వివరణతో రాష్ట్రంలోని రైల్వే ప్రాజెక్టుల్లో ఎందుకు జాప్యం జరుగుతుంతో తెలుస్తోందని.. తద్వారా వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తేటతెల్లమైందని పవన్ మండిపడ్డారు. కేంద్ర రైల్వేశాఖ, రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులు ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఆలస్యమవుతున్నాయని జనసేనాని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం తన వాటాగా నిధులు మంజూరు చేయకపోతే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని ఆయన ప్రశ్నించారు.
ఈమేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో కీలకమైన రైల్వేలైన్లు అసంపూర్తిగా ఉండిపోయాయని.. కోటిపల్లి- నరసాపురం రైల్వే లైన్ పనులు ఎక్కడ వేసిన గొంగడి మాదిరిగా అలాగే ఉన్నాయన్నారు. ఈ ప్రాజెక్టుకు తన వాటాగా రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం నిధులు సమకూర్చాలని.. కానీ ఆ మొత్తాన్ని మంజూరు చేయకపోవడంతో పనులు నిలిచిపోయాయని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.358 కోట్లు ఇస్తేనే ఈ పనులు ముందుకు సాగుతాయని.. ఈ రైల్వే లైన్ పూర్తి చేస్తే ఉభయగోదావరి జిల్లాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు.
అలాగే చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి- నడికుడి ప్రాజెక్టకు రూ.1,351 కోట్లు, కడప- బెంగళూరు రైల్వే లైన్‌కు రూ. 289 కోట్లు, రాయదుర్గం- తమకూరు లైన్‌కు రూ. 34 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందని జనసేనాని గుర్తుచేశారు. రైల్వే పనులకు నిధులు ఇవ్వరని.. భూసేకరణ చేయరని, ఈ విషయాల్లో బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ప్రాజెక్టులు ఎలా పూర్తవుతాయని పవన్ ప్రశ్నించారు.
రాష్ట్రంలో రైల్వే లైన్ల పూర్తికావడానికి పార్లమెంట్ లో కేంద్ర రైల్వే శాఖ చెప్పిన అంశాలను ఎంపీలు తమ సీఎం దృష్టికి తీసుకెళ్లాలని జనసేన అధినేత సూచించారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన పూర్తయినా అది కార్యరూపం దాల్చేలా చేయడంలో ఎంపీలు విఫలమవుతున్నారని పవన్ మండిపడ్డారు. రైల్వే ప్రాజెక్టుల నిర్మాణంలో ఎంపీలు బాధ్యతగా వ్యవహరించాలని.. ప్రకటించిన జోన్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన హితవు పలికారు. ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖ చెప్పిన అంశాలను ఎంపీలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలని.. రైల్వే ప్రాజెక్టులకు నిధులు విడుదలచేయించాలి అని ఎంపీలకు సూచించారు పవన్
