తనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. తెలుగు పలకడం రాని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా వుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తనపై ఏపీ సీఎం వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. భీమవరంలో జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. అ, ఆ లు సరిగ్గా నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని సెటైర్లు వేశారు. జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ముఖ్యమంత్రికి తానే స్వయంగా అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తానంటూ పవన్ వ్యాఖ్యానించారు. తెలుగు పలకడం రాని వ్యక్తి తెలుగు రాష్ట్రానికి సీఎంగా వుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అమ్మఒడికి కార్యక్రమానికి వెళ్లిన సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలా ఇవి అని పవన్ ప్రశ్నించారు. తాను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని.. తానేమీ ఊరికే చెప్పు చూపించలేదని ఆయన పేర్కొన్నారు. మనతో 24 గంటలూ తిట్టించుకోకపోతే, తిట్టించుకునేలా వెధవ పనులు చేయలేకపోతే తాము వైసీపీ నాయకులమే కాదన్నట్లుగా వీళ్ల వైఖరి వుందని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.

ALso Read: దత్తపుత్రుడిలా నాలుగేళ్లకోసారి భార్యలను మార్చలేం: పవన్ కల్యాణ్ పై జగన్

తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని జగన్ తెగ బాధపడుతున్నారని.. ఇకపై ఆయన స్టైల్లోనే మాట్లాడతానని ఆయన సెటైర్లు వేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగురకూడదని.. దీనికి గల కారణాలను ఈ నెల 30న భీమవరం సభలో చెబుతానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ధైర్యం వున్న వాళ్లే రాజకీయాల్లోకి రావాలని, లేదంటే వద్దని ఆయన హితవు పలికారు. 

అంతకుముందు కురుపాంలో జరిగిన అమ్మఒడి సభలో జగన్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ నోటికి అదుపు లేదు, నిలకడ లేదని విమర్శించారు. ప్యాకేజీ స్టార్ ఓ లారీ ఎక్కి ఊగిపోతూ తనకు నచ్చనివారిని చెప్పుతో కొడతానంటాడు, తాట తీస్తానంటాడని పవన్ కళ్యాణ్ పై మండిపడ్డారు సీఎం జగన్. నలుగురిని పెళ్లి చేసుకోని భార్యలను మార్చలేమని పవన్ కళ్యాణ్ నుద్దేశించి జగన్ వ్యాఖ్యానించారు. పెళ్లి అనే బంధాన్ని రోడ్డుపైకి తీసుకు వచ్చారన్నారు. ఇవన్నీ వారికే చెందిన పేటెంట్ అంటూ పవన్ కళ్యాణ్ తీరుపై ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలు చేశారు. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేమని , పూనకం వచ్చినట్టుగా తిట్టలేమన్నారు.