Asianet News TeluguAsianet News Telugu

టెన్త్ విద్యార్ధులే కాదు... వీళ్ల గురించి కూడా ఆలోచించండి: ప్రభుత్వానికి పవన్ విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో విద్యార్ధులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు. 

janasena chief pawan kalyan comments on exams in andhra pradesh
Author
Amaravathi, First Published Jun 23, 2020, 3:13 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ క్రమంలో విద్యార్ధులకు ఏ విధమైన పరీక్షలు నిర్వహించకుండా ఉండటమే శ్రేయస్కరమని సూచించారు. టెన్త్ పరీక్షలు రద్దు చేసినట్లుగానే డిగ్రీ విద్యార్ధుల విషయంలోనూ తగిన నిర్ణయం తీసుకోవాలని పవన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిగ్రీతో పాటు ఎంబీఏ, ఏజీ బీఎస్సీ, ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, ఐటీఐ లాంటి విద్యలు అభ్యసించి చివరి సెమిస్టర్ పరీక్షలకు సిద్ధమైన విద్యార్థులకు ఇప్పుడు పరీక్షలు నిర్వహించే పరిస్ధితి కనిపించడం లేదని జనసేనాని పేర్కొన్నారు.

ఈ విద్యార్ధులు తమ కాలేజీలు ఉన్న పట్టణాలు, నగరాలకు వెళ్లటం, హాస్టల్స్‌లో  ఉండి పరీక్షా కేంద్రాలకు వెళ్లి రావడం వారి ఆరోగ్యాలకు శ్రేయస్కరం కాదని తెలిపారు. మరోవైపు పై చదువులకు వెళ్లేందుకు, క్యాంపస్ సెలక్షన్స్‌లో జరిగిన ఉద్యోగాలకు ఎంపికై సర్టిఫికెట్స్ ఇచ్చేందుకు సమయం దగ్గరపడుతోందని తెలిపారు.

పరీక్షలు లేని కారణంతో పట్టాలు చేతికిరాక అర్హత కోల్పోతామనే ఆందోళన పెరుగుతోందని విద్యార్ధులు జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారని పవన్ చెప్పారు. లక్షల మంది విద్యార్ధుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలు రద్దు చేసి ఉత్తీర్ణతను ప్రకటించాలని జనసేనాని డిమాండ్ చేశారు.

ఇప్పటికే మహారాష్ట్ర, ఒడిషా రాష్ట్రాల్లో డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రద్దు చేశారని అన్నారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విద్యార్ధుల ఆరోగ్యం, వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీలు తగిన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని పవన్ కల్యాణ్ కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios