Janasena: టీడీపీ-జనసేన పొత్తుపై దుమారం.. పవన్ కళ్యాణ్ ఏం చెప్పాలనుకున్నాడు?
పవన్ కళ్యాణ్ ఈ రోజు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. టీడీపీ, జనసేన పొత్తుపై తీవ్ర చర్చను లేవదీశాయి. టీడీపీ పొత్తు ధర్మం పాటించలేదని, వాళ్లు రెండు సీట్లు ప్రకటిస్తే.. తానూ రెండు సీట్లు ప్రకటిస్తున్నానని పవన్ పేర్కొన్నారు. అలాగే, సీఎం సీటుపైనా కామెంట్ చేశారు.
Pawan Kalyan: ఈ రోజు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారాన్ని రేపాయి. ఏపీ పాలిటిక్స్‌లో పవన్ కళ్యాణ్ దారి భిన్నమైనది. ఆయన బీజేపీతో పొత్తులో ఉన్నామని చెబుతూనే ఎన్డీయే వెలుపలి టీడీపీతో పొత్తును ప్రకటించారు. అటు కేంద్రంలో బీజేపీ సపోర్టుతోపాటు ఏపీలో బలమైన ప్రతిపక్షం టీడీపీతో చెట్టాపట్టాలేసుకున్నారు. టీడీపీ, జనసేన పొత్తు పురోగతిలో సీట్ల పంపకం వరకు వచ్చింది. సీఎం సీటుపై ఉభయ పార్టీలు ఆశలు పెట్టుకున్న తరుణంలో సీట్ల పంపకం ఎలా జరుగుతుంది? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి? అనే విషయాన్ని ప్రతిపక్ష శిబిరంతోపాటు అధికార పక్షం కూడా గమనిస్తున్నది. ఈ సందర్భంలోనే ఉభయ పార్టీల మధ్య డిఫరెన్స్‌లు ఉన్నాయని పవన్ కామెంట్‌తో బయటపడింది. అయితే, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవాలి? టీడీపీ, జనసేన కూటమి అటకెక్కే ముప్పు ఉన్నదా? లేక సున్నిత హెచ్చరికలుగానే చూడాలా?
పొత్తు ధర్మం పాటించకుండా టీడీపీ అరకు, మండపేట సీట్లకు అభ్యర్థులను ప్రకటించడం జనసేన శిబిరంలో అసంతృప్తిని రగిల్చింది. మండపేట జనసేన క్యాడర్ వచ్చి పవన్ ముందు అసంతృప్తిని వెళ్లగక్కింది. ఇకపైనా టీడీపీ ఇలాగే తమకు ఇష్టం వచ్చిన చోట్ల తమ అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని జనసేనానిని హెచ్చరించారు. రా కదలిరా సభల్లోనూ చంద్రబాబు గుడివాడలో వెనిగళ్ల రామును, మరికొన్ని చోట్ల అలాగే ఆయా టీడీపీ నేతలను ఎమ్మెల్యేలుగా ఆశీర్వదించాలనే కోణంలో మాట్లాడారు. దీంతో పవన్ కళ్యాణ్ ముందస్తు జాగ్రత్తలకు ఉపక్రమించారు.
Also Read : బీజేపీ కూటమిలోకి జేడీయూ.. 28న సీఎంగా నితీశ్ ప్రమాణం.. ఇద్దరు డిప్యూటీలుగా బీజేపీ ఎమ్మెల్యేలు?
టీడీపీ రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాబట్టి, తాము కూడా ప్రత్యేక పరిస్థితులు రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తామని పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇది కేవలం టీడీపీకి ఒక హెచ్చరికగానే చూడాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే అదే ప్రసంగంలో పవన కళ్యాణ్ కూటమి పైనా మాట్లాడారు. పొత్తు తెగిపోవాలంటే ఎంతసేపు? కానీ, తాము అది కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. పొత్తు అన్నాక ఎక్కవ తక్కువలు ఉంటాయనీ చెప్పుకొచ్చారు. అలాగే.. చాలా స్థానాల్లో జనసేనకు బలం పెరిగిందని, గతంలో కంటే ఈ సారి ఓటు శాతం గణనీయంగా పెరుగుతుందని, ఆ సంకేతాలు ఉన్నాయని పేర్కొన్నారు. తద్వార సీట్లను బార్గెయిన్ చేయడానికి ఓ ప్రాతిపదికను పవన్ కళ్యాణ్ ప్రస్తావించినట్టయింది.
అలాగే.. లోకేశ్ సీఎం తన తండ్రి చంద్రబాబే అవుతాడని చెప్పడంపైనా పవన్ కళ్యాణ్ స్పందించారు. పొత్తులో ఉన్నప్పుడు అలా ప్రకటించరాదని, కానీ, జగన్‌ను దింపాలనే కామన్ గోల్‌ను దృష్టిలో పెట్టుకుని తాను మౌనంగా ఉన్నట్టు చెప్పారు. తద్వార ఒక వేళ ప్రతిపక్షానికి మెజార్టీ సీట్లు వస్తే.. జనసేన సీఎం సీటుపైనా బార్గెయిన్ చేస్తుందని తెలుస్తున్నది. ప్రచారంలో ఉన్నట్టుగా జనసేన 50 నుంచి 60 సీట్లను డిమాండ్ చేస్తున్నదనీ, తద్వారా చెప్పుకోదగ్గ స్థాయిలో సీట్లు గెలుచుకుంటే సీఎం సీటుపై తమ డిమాండ్‌ను బలంగా వినిపించవచ్చని జనసేన భావిస్తున్నది.
వాస్తవానికి 50 నుంచి 60 సీట్లు జనసేన డిమాండ్ చేస్తున్నదన్న ప్రచారాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ఆ వార్తలు అవాస్తవాలని కొట్టిపారేశారు. కానీ, జనసేన మాత్రం స్పందించలేదు.
ఇంతలోనే అధికార వైసీపీ కూడా ఈ రెండు పార్టీల మధ్య డిస్టెన్స్ ఉన్నదని చెప్పే ప్రయత్నం మొదలు పెట్టింది. జనసేన తెలంగాణలో ఫ్లాప్ అయిందని, ఇక్కడా పెద్దగా బలం ఉండకపోవచ్చని టీడీపీ పొగబెట్టే ప్రయత్నం చేస్తున్నదని వైసీపీ ట్విట్టర్ హ్యాండిల్ ఆరోపించింది. జనసేన 50 నుంచి 60 సీట్లు అడుగుతుండగా.. టీడీపీ మాత్రం 15 నుంచి 20 సీట్లకే పరిమితం చేయాలని భావిస్తున్నదని పేర్కొంది.