హైదరాబాద్‌: జమ్మలమడుగు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి షాక్ తగిలింది. టీడీపీకి చెందిన పలువురు కీలక నేతలు గుడ్ బై చెప్పి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి ఆదినారాయణ రెడ్డి, మరియు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గాలకు చెందిన కీలక నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 

పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు వైఎస్ జగన్. కొండాపురం, ముద్దనూరు, పెద్దముడియం మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు పార్టీ వీడారు. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల మధ్య ఆదిపత్యపోరులో నలిగిపోతున్న వీరు నియోజకవర్గ అభివృద్ధికోసం వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు వైసీపీలో చేరడంతో ఆ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగులో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది.