వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ముందుగా అనుకున్నట్లు నవంబర్ 2వ తేదీ నుండి కాకుండా 6వ తేదీ నుండి ప్రారంభమవుతోంది. మొదట అనుకున్న ప్రకారమైతే పాదయాత్ర 2వ తేదీ మొదలవ్వాలి. అయితే 2వ తేదీ గురువారమైంది. మరుసటి రోజే అంటే శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. యాత్ర ప్రారంభించిన రెండోరోజే బ్రేక్ ఎందుకని జగన్ కు పలువురు సూచించారు. దాంతో 2వ తేదీ యాత్రకాస్త 6వ తేదీకి మారింది. అంటే సోమవారం పాదయాత్రను జగన్ మొదలుపెడుతున్నారు. పనిలో పనిగా 4వ తేదీన తిరుమలకు చేరుకుని వెంకటశ్వరుని ఆశీస్సులు తీసుకుంటారు. తర్వాత కడపలోని దర్గా, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడి నుండి  6వ తేదీ ఉదయం 7 గంటల ప్రాంతంలో పాదయాత్ర మొదలవుతుంది. వ్యక్తిగత హాజరునుండి కోర్టులో మినహాయింపు వస్తుందని అనుకున్నారు. అయితే, ఊరట మాత్రం లభించటంతో పాదయాత్ర తేదీని మార్చుకున్నారు.