‘ఇపుడు ఎన్నికలు జరిగితే టిడిపికి డిపాజిట్లు కూడా రావు’..వైసిపి అధినేత వైఎస్ జగన్మహన్ రెడ్డి చెప్పిన మాటలివి. కర్నూలు జిల్లా పత్తికొండలో పాదయాత్ర చేస్తున్న జగన్ మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. ఉపాధిహామీ పథకంలో జరుగుతున్న అవినీతిని చూసి కేంద్రప్రభుత్వమే భయపడిపోయిందన్నారు. అవినీతిని ప్రశ్నిస్తే హత్యలు చేస్తూ, అక్రమ కేసులు పెడుతున్నట్లు మండిపడ్డారు. ఈ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని, ఇప్పుడు ఎన్నికలు జరిగితే టిడిపికి డిపాజిట్లు కూడా రావంటూ జగన్ బల్లగుద్ది మరీ చెప్పారు.

గిట్లుబాటు ధరలు లేక రైతులు, ఉద్యోగాలు లేక యువత, నిరుద్యోగులు, ఉపాధి, భద్రత లేక మహిళలు, వేధింపులతో ఉద్యోగులు ఇలా..అందరూ ఇబ్బందులు పడుతూనే ఉన్నారంటూ జగన్ మండిపడ్డారు. అబద్దాలు, మోసాలతోనే చంద్రబాబు పరిపాలన చేస్తున్నట్లు ఎద్దేవా చేశారు. పత్తికొండ వైసిపి ఇన్ చార్జి చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య ఘటనను కూడా జగన్ ప్రస్తావించారు. పొదుపు, డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన జీరో వడ్డీ బకాయిలు కూడా ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించటం లేదని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి రాగానే అన్నీ వర్గాలను సంతోష పెట్టే పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో వైసిపి పత్తికొండ అభ్యర్ధిగా శ్రీదేవిరెడ్డిని ప్రకటించారు జగన్.