ప్రజల్లో చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఉందన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు తనపై నమ్మకం ఉండడం వల్లే సమస్యలు చెప్పుకుంటున్నారన్నారని. ‘దేవుడు అవకాశం ఇస్తే తప్పకుండా హిస్టరీ క్రియేట్ చేస్తా’నన్నారు. ఈ అవకాశం ఉపయోగించుకోలేకపోతే రాజకీయ నాయకుడిగా ఉండడం వ్యర్థమని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రావాల్సిందేనన్న జగన్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

60 ఏళ్ల హైదరాబాద్ లాగే పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసుకోవచ్చన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలేదని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీకి చిత్తశుద్ధి ఉంటే 22 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలన్నారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేకుండా చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోలేకపోతే రాబోయే రోజుల్లో అందరికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు.

తమ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి వ్యాధికైనా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం చేయించి రోగిని చిరునవ్వుతో ఇంటికి పంపుతామన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు సర్కారు నీరుకార్చిందని ధ్వజమెత్తిన జగన్ తాము పవర్లోకి వచ్చిన వెంటనే ఆరోగ్య శ్రీ వ్యవస్థను మెరుగుపర్చుస్తామన్నారు. క్యాన్సర్, కిడ్నీ మార్పిడి, మోకాళ్ల శస్త్రచికిత్సలు, బధిరులైన పిల్లలకు ఫ్రీగా ఆపరేషన్లు చేయిస్తామన్నారు. అన్ని వర్గాలను మోసం చేస్తున్న చంద్రబాబు పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరకు వచ్చాయన్నారు. రామాయణం, మహా భారతం, ఖురాన్ కూడా అంతిమంగా నిజాయితీనే గెలిచిందని గుర్తు చేశారు.  భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయటమే తన థ్యేయంగా చెప్పుకున్నారు.