అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళలకు వైయస్ జగన్ ప్రభుత్వం ఉగాది కానుక ప్రకటించారు. రాష్ట్రంలో గ్రామాల్లో ఇళ్లులేని అర్హులైన పేదలకు ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కొని, ఆ ఇంట్లోని మహిళల పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసి ఉగాది రోజున అందజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయిస్తూ తీర్మానించింది. 

అమరావతిలో ఏపీ సీఎం వైయస్ జగన్ నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో అమ్మఒడి పథకం అమలుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జనవరి 26 నుంచి అమ్మఒడి పథకం అమలు చేయాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. 

ఈ పథకం ద్వారా పిల్లలను బడులకు పంపే తల్లులకు రూ.15,000 చెక్కులు అందజేయాలని నిర్ణయించింది. అలాగే సెప్టెంబర్‌ 1 నుంచి గ్రామవాలంటీర్ లు అందుబాటులోకి రానున్నారని మంత్రి పేర్నినాని తెలిపారు. గ్రామవాలంటీర్లే రేషన్‌ హోం డెలివరీ చేయబోతున్నట్లు తెలిపారు. 

నాణ్యమైన మేలు రకం బియ్యాన్ని వాలంటీర్ల ద్వారా డోర్‌ డెలివరీ చేస్తామన్నారు. బియ్యంతో పాటు ఐదారు నిత్యావసర వస్తువులను  జత చేసి ప్రజలకు అందజేయాలని తీర్మానించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపరచాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. 

40 వేల ప్రభుత్వ పాఠశాలలను రీమోడలింగ్‌ చేసేందుకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఫొటోలు తీసి వాటిని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. 40 కి.మీ పరిధిలో మధ్యాహ్నం భోజన పథకం కోసం కేంద్రీకృత వంటగది ఏర్పాటు చేసి పిల్లలకు పౌష్టికాహారాన్ని అందజేయాలని ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 

ఈ వార్తలు కూడా చదవండి

అగ్రిగోల్డ్ బాధితులకు తీపికబురు: రూ.1150కోట్లు జమచేయాలని కేబినెట్ నిర్ణయం

టీటీడీ పాలకమండలి, నామినేటెడ్ పోస్టులు రద్దు: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త: ఆర్టీసీ విలీనానికి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్