అమరావతి: ఏపీఎస్ఆర్టీసీపై ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మానవీయ కోణంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం జగన్ స్పష్టం చేసినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆర్టీసీ రూ. 6,400 కోట్ల రూపాయలతో నష్టంలో ఉందన్నారు. 

గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగల ప్రావిడెంట్ ఫండ్ రూ.2,900 కోట్లు సైతం ఉపయోగించారని వాటన్నింటిని సరిచేయనున్నట్లు తెలిపారు. అలాగే వివిధ బ్యాంకుల నుంచి రూ.3,000 కోట్లు అప్పులు ఉన్నాయని తెలిపారు. ఆర్టీసీ విలీనంపై సబ్ కమిటీ, సాంకేతిక కమిటీలను నియమించినట్లు తెలిపారు. 

ఆర్థికశాఖ, రవాణా శాఖల నేతృత్వంలో ఒక కమిటీని, నిపుణులతో టెక్నికల్ కమిటీని నియమించినట్లు తెలిపారు. ఈ రెండు కమిటీలు రెండు నెలల్లో పూర్తిస్థాయి నివేదికలు అందించాలని జగన్ కోరినట్లు స్పష్టం చేశారు. 

అలాగే ఆర్టీసీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తేవాలని తద్వారా ప్రజలపై భారం తగ్గించవచ్చుననని సీఎం జగన్ అభిప్రాయం వ్యక్తం చేసినట్లు మంత్రి పేర్ని నాని స్పస్టం చేశారు.