వైసీపీ అధినేత బిసి సామాజిక వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఓ కుల సంఘం సమావేశంలో జగన్ పాల్గొనటం ఇదే మొదటిసారి. ముందస్తు ఎన్నికల వాతావరణం నేపధ్యంలో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనబెట్టి మరీ బిసిల సమావేశంలో జగన్ పాల్గొనటం గమనార్హం.
వైసీపీ అధినేత బిసి సామాజిక వర్గాలను దగ్గరకు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు. పార్టీ పెట్టిన దగ్గర నుండి ఓ కుల సంఘం సమావేశంలో జగన్ పాల్గొనటం ఇదే మొదటిసారి. ముందస్తు ఎన్నికల వాతావరణం నేపధ్యంలో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కనబెట్టి మరీ బిసిల సమావేశంలో జగన్ పాల్గొనటం గమనార్హం. ఇంతవరకూ బిసి సామాజికవర్గం టిడిపికి మద్దతుగా నిలబడుతున్న విషయం అందరికీ తెలిసిందే. అటువంటిది వచ్చే ఎన్నికల్లో బిసి సామాజికవర్గాన్ని టిడిపికి దూరం చేయటం ద్వారా తనవైపు తిప్పుకునేందుకు జగన్ ఎత్తులు వేస్తున్నట్లు కనబడుతోంది.
ఈరోజు జరిగిన వైసీపీ అనుబంధ బిసి సంఘాల సమావేశంలో పాల్గొన్న జగన్ మాట్లాడిన మాటలు అదే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నాయ్. పార్టీలోని బీసీ నేతలందరూ అన్ని జిల్లాల్లో పర్యటించి బీసీలు ఎదోర్కుంటున్న సమస్యలపై పోరాటాలు చెయ్యాలన్నారు. బీసీలకు న్యాయం చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మోసం చేసారని మండిపడ్డారు.
అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్ ను వైసీపీ అమలు చేస్తుందని హామీ ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వానికి బీసీల పవర్ ఏంటో చూపించాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లోని బీసీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలన్నారు.
పది వేల కోట్లతో బీసీలకు సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తానని చెప్పి మూడు బడ్జెట్లలో కేటాయించింది కేవలం రూ. 4000 కోట్లు మాత్రమే అని ఎద్దేవా చేసారు. ఓటు బ్యాంకు గా మాత్రమే బీసీలను చూస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీలకు ఇస్త్రీ పెట్టెలు, కత్తెరలు పంచితే సరిపోతుందా అంటూ ప్రశ్నించారు. వైస్ సీఎంగా ఉన్నపుడు బీసీలకు న్యాయం చేసిన విషయాన్ని గుర్తుచేసారు. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇచ్చిన ఘనత కూడా వై ఎస్ దే అన్నారు..
బీసీలకు న్యాయం జరిగేందుకే ‘అన్న వస్తున్నాడు’ అని చెప్పండన్నారు. బీసీలకు 13లక్షల ఇళ్ళు కట్టించిన ఘనత వైఎస్ దే అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ అందరికి ఉచితంగా వర్తింపజేసిన విషయాన్ని గుర్తుచేసారు. బీసీలను మోసం చేసిన చంద్రబాబుప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీసీల సత్తా చాటేందుకు త్వరలో బీసీ గర్జన జరుపుతామని చెప్పారు.
