వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమైన పరిస్ధితులు మళ్ళీ తలెత్తినట్లు మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకం నిర్వహణపై ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసారు. పథకం అమలుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. వైద్యం కోసం పేదలు పొలాలు అమ్ముకోవాల్సిన దుర్భరమైన పరిస్ధితులు మళ్ళీ తలెత్తినట్లు మండిపడ్డారు.
ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలుకాక చదువుల కోసం, వైద్యం కోసం పొలాలు అమ్ముకునే పరిస్ధితి వచ్చిందని చంద్రబాబును దుయ్యబట్టారు. పైగా పొలాలు అమ్ముకుందామన్నా అమ్ముకునే వీలు లేకుండా రిజిస్రేషన్లు బంద్ చేసినట్లు ధ్వజమెత్తారు.
బందర్ పోర్టు అభివృద్ధి పేరుతో పల్లెల్లోని భూములను బలవంతంగా లక్కోవటం తనను కలచివేసినట్లు జగన్ లేఖలో తన ఆవేదనను వెలిబుచ్చారు. రాష్ట్రంలోని పేదలకు వరంగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకాన్ని పథకం ప్రకారం మీరు బలహీన పరుస్తున్నారా లేక మీ అసమర్ధత వల్ల పథకం బలహీనపడుతున్నదా అని జగన్ ధర్మ సందేహాన్ని లేవదీయటం గమనార్హం.
