నారాయణరెడ్డి హత్యలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పాత్రదారైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రదారుగా జగన్ ఆరోపించారు. మూడేళ్ళ నుండి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, ధౌర్జన్యాలు, దాడులు పెరిగిన విషయాన్ని గవర్నర్ కు వివరించినట్లు జగన్ తెలిపారు.

రాష్ట్రంలో అధికార పార్టీ హత్యా రాజకీయాలపై ప్రతిపక్ష వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ కు ఫిర్యాదు చేసారు. ఈరోజు ఉదయం రాజ్ భవన్లో గవర్నర్ ను కలిసారు. టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకూ తమ పార్టీ నేతలపై జరిగిన హత్యలను, దౌర్జనాలను వివరించారు. సుమారు అర్ధగంట పాటు జరిగిన సమావేశంలో కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ చెరుకులపాటి నారాయణరెడ్డిని హత్య చేసిన విధానాన్ని వివరించారు.

తర్వాత మీడియాతో మాట్లాడుతూ, నారాయణరెడ్డి హత్యలో ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి పాత్రదారైతే ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రదారుగా జగన్ ఆరోపించారు. మూడేళ్ళ నుండి రాష్ట్రంలో హత్యా రాజకీయాలు, ధౌర్జన్యాలు, దాడులు పెరిగిన విషయాన్ని గవర్నర్ కు వివరించినట్లు జగన్ తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవటం ఈ రాష్ట్ర దురదృష్టమని మండిపడ్డారు. జిల్లాలోని ఇసుక మాఫియాను అడ్డుకుంటున్నారన్న కోపంతోనే నారాయణరెడ్డిని కెఇ హత్య చేయించినట్లు చెప్పారు.

ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు అవహేళన చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. తమ పార్టీనేతలు ప్రలోభాలకు లొంగకపోతే హత్యలు చేయిస్తున్నట్లు జగన్ పేర్కొన్నారు. వివిధ కేసుల్లో ఇరుక్కున్న తమ పార్టీ నేతలను కేసుల నుండి బయటపడేసేందుకు ప్రభుత్వం 132 జివోలను విడుదల చేసిన విషయాన్ని కూడా గవర్నర్ కు వివరించినట్లు చెప్పారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి పత్తికొండకు బయలుదేరి వెళ్ళారు.