అమరావతి: ఇంటలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ పొడిగించింది జగన్ సర్కార్.ఆగస్ట్ 5 వరకూ ఏబీపై ఉన్న సస్పెన్షన్ ను పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. సివిల్ సర్వీస్ అధికారుల సస్పెన్షన్ రివ్యూ కమిటీ నివేదిక ఆధారంగా ఈ సస్పెన్షన్ పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు వైసిపి ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.   

సెక్యూరిటీ పరికరాల కొనుగోలులో  ఏబీ వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడినట్టుగా  జగన్ ప్రభుత్వం భావిస్తోంది.  ఈ కారణంగానే అధికారంలోకి వచ్చిన వెంటనే  వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ విధించింది ప్రభుత్వం. 

చంద్రబాబునాయుడు ఏపీ సీఎంగా ఉన్న కాలంలో ఇంటలిజెన్స్ ఏపీ చీఫ్ గా వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఆ సమయంలో వైసీపీ నుండి 23 మంది ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడంలో ఏబీ వెంకటేశ్వరరావు కీలకంగా పనిచేశారని ఆ సమయంలో  వైసీపీ తీవ్రంగా విమర్శలు చేసింది.

వైసీపీ ఏపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీ వెంకటేశ్వరరావును పక్కన పెట్టింది. ఎనిమిది మాసాలుగా ఆయనకు ఎక్కడా కూడ పోస్టింగ్ ఇవ్వలేదు. సెక్యూరిటీ పరికరాల కుంభకోణంలో ఏబీ వెంకటేశ్వరరావు నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించాడని ఏపీ ప్రభుత్వం ఆరోపించింది.ఈ మేరకు ఆయనను సస్పెండ్ చేస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సస్పెన్షన్ తాజాగా మరింత పొడిగించింది.