జగన్ రైతులతో కలవకూడదని, జగన్ సభలకు రైతులు హాజరుకాకూడదని ప్రభుత్వం నిర్భందం చేస్తోందంటేనే తప్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా?
మొత్తం మీద ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పంతాన్ని నెరవేర్చుకున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఆంక్షలు విధించినా రాజధాని ప్రాంతంలోని నిడమర్రు, లింగాయపాలెం గ్రామాల్లో పర్యటించారు. సరే ప్రభుత్వంపై ఆరోపణలు చేయటం, విరుచుకుపడటం మామూలేననుకోండి. రైతులు కూడా వేదికపై నుండే ప్రభుత్వ వైఖరిపై అనేక ఆరోపణలు చేయటం గమనార్హం.
అయితే, ఇక్కడ కొన్ని గమనించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. వేలాదిమంది రైతులు జగన్ పర్యటనలో ఎందుకు పాల్గొన్నారు? రాజధాని నిర్మాణం కోసం రైతులే స్వచ్ఛందంగా తమ భూములను ఇచ్చారని కదా ఇంతకాలం చంద్రబాబు ఏమి చెబుతున్నది?
తమ భూములను తీసుకున్న ప్రభుత్వం మోసం చేసిందని రైతులు వేదికపై నుండే చెప్పారంటే, ఎందుకు చెప్పారు ? స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులకు ప్రభుత్వంపై అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఏమిటి? అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్. భూములు తీసుకునేటపుడు రైతులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైంది. దాంతో రైతులు జగన్ సభల్లో భారీగా పాల్గొన్నారు. వారికి జగన్ ఏదో ఒరగబెడతారని కాదు కానీ ప్రభుత్వంపై ఉన్న కోపంతోనే అంతమంది హాజరైనట్లు అర్ధం చేసుకోవాలి.
జగన్ సభలో పాల్గొన్న రెండు గ్రామాల రైతులూ బహిరంగంగానే చంద్రబాబునాయుడుపై ఆరోపణలు చేసారు. జగన్ కూడా తన ప్రసంగాల్లో రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చమనే డిమాండ్ చేసారు. మార్కెట్ రేటు ఇచ్చి రైతుల భూములను తీసుకోవాలని సూచించారు. జగన్ రైతులతో కలవకూడదని, జగన్ సభలకు రైతులు హాజరుకాకూడదని ప్రభుత్వం నిర్భందం చేస్తోందంటేనే తప్పు చేస్తున్నట్లు ప్రభుత్వం ఒప్పుకున్నట్లే కదా? కాబట్టి, బాబు గారూ ఇప్పటికీ మించిపోయింది లేదు.. రైతులకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేస్తే మళ్ళీ ఇంకోరు రాజధాని గ్రామాల్లో పర్యటించాల్సిన అవసరం ఉండదు.
