పగలు పాదయాత్ర..రాత్రిళ్ళు పార్టీ పని

పగలు పాదయాత్ర..రాత్రిళ్ళు పార్టీ పని

ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏకకాలంలో రెండు పనులు చేస్తున్నారు. పగలంతా పాదయాత్ర చేస్తూనే రాత్రిళ్ళు పార్టీ బలోపేతంపై పూర్తి స్ధాయిలో దృష్టి పెట్టారని సమాచారం. పాదయాత్రలో భాగంగా స్ధానిక నేతలను, వివిధ  మండలాల్లోని ప్రముఖులను కలుస్తున్నారు. తనతో పాటు కొద్దిదూరం వారిని కూడా నడిచేట్లు చేస్తున్నారు. ఆ కాస్త సమయంలోనే వారితో స్ధానిక విషయాలపై మాట్లాడుతున్నారు. వారితో మాట్లాడేటపుడు పార్టీకి నేతలు దగ్గర లేకుండా చూసుకుంటున్నారట.

పనిలో పనిగా నియోజకవర్గంలో దృష్టి పెట్టాల్సిన అంశాలేమిటి? తమ పార్టీ నేతల పనితీరు ఎలాగుంది? ప్రభుత్వ విధానం, సమస్యలు, పరిష్కారాలన్నింటినీ వారితో చర్చిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా వచ్చే ఎన్నికల గురించి కూడా వారితో మాట్లాడుతూ ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. అదే సమయంలో ప్రజలు చెబుతున్న సమస్యలను వినటం, వారికి సమాధానాలిస్తూనే ఉన్నారు. మధ్యలో చిన్నపాటి బహిరంగ సభల్లో కూడా ప్రసంగిస్తున్నారు.

సాయంత్రం పొద్దుపోయిన తర్వాత ఎక్కడైతే బస చేస్తున్నారో అక్కడికి కూడా స్దానికంగా ఉన్న ప్రముఖులెవరైనా వస్తే వారిని కూడా కలుస్తున్నారు. చివరగా పార్టీ నేతలతో సమావేశమైనపుడు తాను తీసుకున్న ఫీడ్ బ్యాక్ ను వారితో చర్చిస్తున్నారట. అదే సమయంలో నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ వైసీపీలోకి వచ్చే నేతలపై వాకాబు చేస్తున్నారట. ఎంఎల్ఏలుంటేనేమో ఫీడ్ బ్యాక్ ను వారికి అందిస్తూ వాటిపై వర్కవుట్ చేయమని, తాను మాట్లాడిన ప్రముఖులను కలవమని చెబుతున్నారు.

పనిలో పనిగా పార్టీలో చేయాల్సిన మార్పులు చేర్పులపై కూడా దృష్టి పెడుతున్నారు. అందులో భాగమే ఇటీవలే 30 మందికి పార్టీలో పదోన్నతులు, కొత్తగా నియమించటం అందరికీ తెలిసిందే. నియోజకవర్గల్లో పార్టీని బలోపేతం చేయటం కోసం తీసుకోవాల్సిన చర్యలను, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్న ఆశావహుల వివరాలపైన కూడా చర్చిస్తున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలు తనకెంత కీలకమో జగన్ కే బాగా తెలుసు. కాబట్టే తాడో పేడో తేల్చుకునే రీతిలోనే సాహసానికి దిగారు. అందుకనే పగలు పాదయాత్ర చేస్తూనే రాత్రిళ్ళు పార్టీ బలోపేతానికి చర్చలు జరుపుతున్నారు.

 

 

 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos