అమరావతి: అమరావతిని ప్రత్యేక వ్యవసాయ  జోనుగా ప్రకటించే యోచనలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అమరావతి నుండి రాజధానిని తరలిస్తే ఈ ప్రాంతాన్ని వ్యవసాయ జోనుగా ప్రకటించేందుకు విషయమై సర్కార్ కసరత్తు చేస్తోంది.

అమరావతిలో రాజదాని ఏర్పాటు కోసం చంద్రబాబునాయుడు సర్కార్ సుమారు 30 వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించింది.ఇప్పటికే కొన్ని భవనాలను నిర్మించారు. అయితే ఏపీని సమగ్రంగా అభివృద్ది చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో రాజధానులు ఏర్పాటు చేయాలనే యోచనలో ఏపీ సర్కార్ ఉంది.

అమరావతి నుండి రాజధానిని తరలించకూడదని రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో అమరావతిని ప్రత్యేక వ్యవసాయ జోనుగా ప్రకటించాలని సర్కార్ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు నివేదికను సిద్దం చేస్తున్నారు. 

ప్రస్తుతమున్న రోడ్లు.. భవనాలను యధాతధంగా ఉంచేసి మిగిలిన భూమిని స్పెషల్ అగ్రి జోన్ గా ప్రకటించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు స్పెషల్ అగ్రికల్చరల్ జోన్ (saz) ను ఉపయోగించాలని సర్కార్ యోచిస్తోంది. 

ల్యాండ్ పూలింగ్ భూములతో పాటు  ప్రభుత్వ భూములనూ  కూడ ఎస్ఏజడ్ పరిధిలోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని  ప్రత్యేక ఆర్ధిక మండళ్ల పురోగతిని పరిశీలించిన  అనంతరం నివేదికకు నిపుణులు రూపకల్పన చేయనున్నారు.

వాణిజ్య పరంగా అత్యంత విలువైన పంటలకు హబ్ గా అమరావతి ప్రాంత అభివృద్ధికి సర్కార్ ప్రణాళికలను చేయనుంది. స్పెషల్ అగ్రికల్చర్ జోనుకు రాష్ట్రంలోని వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, శాస్త్రవేత్తల పరిశోధనలకు కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అమరావతి అనుకూలంగా ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

స్పెషల్ అగ్రికల్చర్ జోనులో రైతులను భాగస్వాములను చేయాలని నిపుణులు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. తద్వారా రైతులకు మరింత లబ్ది కలిగించాలని సర్కార్ భావిస్తోంది. 

రిటర్నబుల్ ప్లాట్లను రైతులకు ఇచ్చి మిగిలిన భూములను ఎస్ఏజడ్ పరిధిలోకి తీసుకువస్తే ఎలా ఉంటుందనే విషయమై సర్కార్ ఆలోచిస్తోంది. స్పెషల్ అగ్రికల్చర్ జోనులో నిపుణలతో పాటు ఇతరులకూ పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.