అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్ అవసరం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన ప్రకటనపై దుమారం చెలరేగుతోంది. శ్రీవారిపై భక్తి విశ్వాసాలతో తిరుమలకు వచ్చే అన్య మతస్థులులు స్వామివారిని దర్శించుకునేందుకు ఎటువంటి డిక్లరేషన్ అవసరం అవసరం లేదని ఆయన చెప్పారు. 

వైవీ సుబ్బారెడ్డి ప్రకటనపై రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణా రావు తీవ్రంగా మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఈనాటిది కాదని, ఎన్నో ఏళ్లుగా టీటీడీలో కొనసాగుతున్న నిబంధన అని, విద్యార్థి దశలో తిరుమల దర్శనానికి వెళ్లినప్పుడు తమతో పాటు క్యూలో ఉన్న ఓ విదేశీయుడిని డిక్లరేషన్ సంతకం పెట్టిన తర్వాతనే దర్శనానికి అనుమతించారని ఆయన అన్నారు. 

 

సోనియా గాంధీ దర్శనానికి వచ్చినప్పుడు కూడా నాటి కార్యనిర్వాక అధికారి ఈ డిక్లరేషన్ కోసం పట్టుబట్టి కొందరు నేతల ఆగ్రహానికి గురయ్యారని ఆయన గుర్తు చేశారు. ఈనాడు ఉన్న ఫలంగా ఈ మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఏమిటని ఆయన అడిగారు. 

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రే వస్త్రాలు సమర్పించాలని ఎక్కడా లేదని, విశ్వాసం లేనినాడు ఆ కార్యక్రమాన్ని దేవాదాయ శాఖ మంత్రి నిర్వహించవచ్చునని ఆయన అన్నారు.