ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజులుగా సాగుతున్న ఐటీ  దాడుల వల్ల పరిస్థితులు హాట్ హాట్ గా మారాయి. ఈ దాడులకు రాజకీయ రంగు కూడా అంటుకోవడంతో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది.

చంద్ర బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంటిపై కూడా దాడులు జరగడం... దొరికిందేన్తో కూడా పూర్తి వివరాలు బయటకు రాకముందే వైసీపీ వర్గాలు 2వేల కోట్లు దొరికాయని ప్రచారం చేయడం, దాన్ని ఖండిస్తూ టీడీపీ వారు కూడా ప్రెస్ మీట్లు పెట్టడం... అన్ని వెరసి ఒక పొలిటికల్ వార్ ను తలపించింది. 

ఇక తాజాగా చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఐటీ దాడుల్లో పట్టుబడిన సొమ్ము వివరాలు పేర్కొన్న పంచనామా నివేదికను ఐటీ శాఖ విడుదల చేసింది. ఆ నివేదికలో శ్రీనివాస్ ఇంట్లో దొరికింది 2 వేల కోట్లు కాదన్న విషయాన్నీ ఐటీ శాఖ తేల్చి చెప్పింది. 

ఆ సోదాల్లో కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు ఐటీశాఖ తెలిపింది.  రూ.2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్టు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది. 

పంచనామా నివేదికపై శ్రీనివాస్, ఐటీ అధికారుల సంతకాలు కూడా ఉన్నాయి. ఈ పంచనామా నివేదిక బయటకు రావడంతో ఒక్కసారిగా టీడీపీ వైసీపీపై రాజకీయ ఎదురుదాడిని మొదలుపెట్టింది. అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారంటూ వైకాపాపై విరుచుకుపడుతున్నారు. 

ఈ విషయమై మాజీ డిప్యూటీ సీఎం చినరాజప్ప ట్విట్టర్ వేదికగా స్పందించారు. "తప్పుడు ప్రచారం అని ముందే చెప్పాము. ఇదిగో, ఈ రోజు ఐటీ అధికారులు ఇచ్చిన పంచనామా సాక్ష్యం.

పచ్చకామెర్ల వాడికి, లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అనేది సామెత. అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళకి, అందరూ అవినీతిపరుల లా కనబడుతారు అనేది రుజువయ్యింది." అని రాసుకొచ్చారు. 

మరో టీడీపీ నేత జయ నాగేశ్వర్ రెడ్డి కూడా ఇదే విధంగా స్పందించారు. "పీఎస్ శ్రీనివాస్ గారింట్లో 2000 కోట్లు దొరికింది అని విష ప్రచారం చేసిన కొన్ని పెయిడ్ మీడియాలకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు విడుదల చేసిన పంచనామా!" అని అన్నారు.