గత 10ఏళ్లుగా అతను మద్యానికి అలవాటు పడ్డాడు. కరోనా సమయంలో మద్యం దొరకకపోవడంతో.. నిద్రపోవడానికి మత్తు మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకున్నాడు
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన విజయవాడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడకు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి క్రొవ్విడి వెంకట ఈశ్వర సత్య సాయి కృష్ణ(34) స్థానిక ఏఎస్ఎం కళాశాల రోడ్డులో నివాసముంటున్నాడు. మూడు నెలల నుంచి ఇన్ఫోసిస్ సీనియర్ కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా కావడంతో ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్నాడు.
గత 10ఏళ్లుగా అతను మద్యానికి అలవాటు పడ్డాడు. కరోనా సమయంలో మద్యం దొరకకపోవడంతో.. నిద్రపోవడానికి మత్తు మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకున్నాడు. ఈ నెల 27న అధిక మోతాదులో మద్యం తాగి మత్తులో గట్టిగా కేకలు వేస్తూ ఇంట్లోనే రాత్రి నిద్రపోయాడు.
సోమవారం ఉదయం భార్య శిరీష వెళ్లి చూడగా.. స్పృహ కోల్పోయి కనిపించాడు. వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా..అప్పటికే చనిపోయినట్లు గుర్తించారు. మత్తు మాత్రల వినియోగం, మద్యం ఎక్కువ మోతాదులో తాగడం.. మధుమేహం తదితర అనారోగ్య సమస్యల కారణంగా తన భర్త చనిపోయాడని.. మృతుని భార్య పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. వెంకట ఈశ్వర సత్య సాయి కృష్ణ.. గత ఏడాది ఏప్రిల్ లో కొందరు స్నేహితులతో కలిసి ఇంట్లోనే కరోనా అంచనా వేసేలా స్వీయ పరీక్షలు చేసుకునే కోవిడ్ చెక్ కొవిడ్ డాట్ కామ్ ఆండ్రాయిడ్ వెబ్, యాప్ ను తయారు చేసి వార్తల్లోకి ఎక్కాడు. ఇప్పుడు ఇలా చనిపోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
