శ్రీకాకుళం జిల్లాలో పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ ఏజెంట్‌ను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం సృష్టించింది. విశాఖ నుంచి శ్రీకాకుళం జిల్లా మీదుగా ఇచ్చాపురం వైపు ఉగ్రవాది అష్రాఫ్ వెళ్తుండటాన్ని గుర్తించిన భారత నిఘా వర్గాలు శ్రీకాకుళం పోలీసులను అప్రమత్తం చేశాయి.

Also Read:భారత్ పై పాక్ కుట్ర: ఉగ్రవాదులతో కలిసి భారీ విధ్వంసానికి ప్లాన్

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చిలకపాలెం టోల్‌గేట్ వద్ద కాపు కాశారు. వారిని గుర్తించిన అష్రఫ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. పలాసా టోల్‌గేట్ వద్ద నుంచి ఇచ్చాపురం వెళ్తున్నట్లు గుర్తించారు.

మరోసారి అప్రమత్తమైన పోలీసలు కంచిలి పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి.. రెండు గంటల పాటు ట్రాఫిక్‌ను నిలిపేశారు. ఆ సమయంలో ఓ లారీ అనుమానాస్పదంగా కనిపించడంతో అడ్డుకుని అందులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

Also Read:టార్గెట్ ఆర్మీ.. వయా హైదరాబాద్: నల్లకుంటలో ఐఎస్ఐ టెలిఫోన్ ఎక్స్చేంజ్

వీరిలో ఒకరిని అష్రఫ్‌గా గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఐఎస్ఐ ఏజెంట్‌ను పట్టుకున్న విషయమై హైదరాబాద్‌కు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులకు, ఢిల్లీలోని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు, నిఘా వర్గాలు ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.