వై.ఎస్. షర్మిలకు పగ్గాలు: కాంగ్రెస్ కు పూర్వవైభవం వచ్చేనా?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతంపై ఆ పార్టీ దృష్టి పెట్టింది.ఈ క్రమంలోనే వై.ఎస్. షర్మిలకు పార్టీ పగ్గాలు అప్పగించింది పార్టీ నాయకత్వం.
అమరావతి: కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ పగ్గాలు వై.ఎస్. షర్మిలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం. షర్మిలకు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వస్తుందని ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ పార్టీ ఉనికిలో లేకుండా పోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణమని ఆంధ్రప్రదేశ్ వాసులు ఆ పార్టీని రాజకీయంగా దెబ్బతీశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్య నేతలు కూడ వైఎస్ఆర్‌సీపీ, తెలుగు దేశం పార్టీల్లో చేరారు. కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరూ మాత్రమే మిగిలారు. కాంగ్రెస్ నేతలు కూడ అంతగా యాక్టివ్ గా లేరు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. కాంగ్రెస్ పార్టీతో విభేదించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ (వైఎస్ఆర్‌సీపీ)ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు ఎక్కువగా వై.ఎస్. జగన్ వైపు వెళ్లిపోయింది. దీంతో వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్ ఓటు బ్యాంకును తిరిగి తమ వైపునకు రప్పించేందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలను కూడ షర్మిలకు అప్పగించింది ఆ పార్టీ నాయకత్వం. వైఎస్ఆర్‌సీపీ వైపు మళ్లిన ఓటు బ్యాంకు షర్మిల కాంగ్రెస్ లో చేరికతో తమ వైపునకు తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తుంది. అయితే ఆ ఓటు బ్యాంకు ఏ మేరకు తమ వైపునకు వస్తుందనేది ప్రస్తుతం చర్చ సాగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. 2009 సెప్టెంబర్ 2న హెలికాప్టర్ లో మరణించే సమయానికి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
also read:పైలెట్ పై దాడిలో మరో ట్విస్ట్: కారణాలు వివరిస్తూ వీడియో పోస్టు చేసిన ప్యాసింజర్
రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయడం వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కోరిక అని షర్మిల చెబుతున్నారు. ఈ దిశగా తన ప్రణాళిక ఉంటుందని షర్మిల తన వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
also read:ఆంధ్రప్రదేశ్ వీరభద్రస్వామి ఆలయంలో మోడీ పూజలు: రంగనాథ రామాయణంలో పద్యాలు విన్న ప్రధాని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం కోసం షర్మిలను రంగంలోకి దించింది ఆ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ఈ ప్రయోగం కలిసి వస్తుందనేది అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి .
also read:సుప్రీం ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు: బాబు పిటిషన్ సీజేఐకి బదిలీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో టిక్కెట్లు దక్కని అసంతృప్తులు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే వైఎస్ఆర్‌సీపీ అసంతృప్తులు కొందరు కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే ప్రచారం కూడ లేకపోలేదు. ఆళ్ల రామకృష్ణా రెడ్డి కాంగ్రెస్ లో చేరుతానని ప్రకటించారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాజీ మంత్రి రఘువీరారెడ్డితో భేటీ అయ్యారు. కాపు రామచంద్రారెడ్డి కూడ కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందనే ప్రచారం సాగుతుంది.