జీఎస్టీ అమలుపై అసంతృప్తి ఉందా ?

First Published 21, Nov 2017, 4:47 PM IST
is Vice president unhappy over implementation of GST
Highlights
  • ‘బీడీకి బెంజ్ కీ ఒకే పన్ను విధానం ఉండటం, అదీ 18 శాతం.. సమంజసమా’...ఇది ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా వ్యాఖ్యలు.

‘బీడీకి బెంజ్ కీ ఒకే పన్ను విధానం ఉండటం, అదీ 18 శాతం.. సమంజసమా’...ఇది ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తాజా వ్యాఖ్యలు. ‘అన్నీ వస్తువలపై 18 శాతం జిఎస్టీ ఉండాలని నిన్నెవరో అన్నారని అది వినటానికి సొంపుగానే ఉంటుంది’ అంటూ చెప్పారు. ఇలాంటి అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలే తప్ప ఏకపక్షంగా కాదని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రభకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్య జిఎస్టీపై తన అబిప్రాయాలు వెల్లడించారు. చూడబోతే జిఎస్టీ అమలు విధానంపై ఉపరాష్ట్రపతిలో బాగా అసంతృప్తి ఉన్నట్లు కనబడుతోంది.

సోపుకు సూపర్ లగ్జరీ కారుకు 18 శాతం పన్ను ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదన్నారు. 28 శాతం పన్నును 18 శాతానికి తగ్గించినపుడు సున్నా శాతం పన్నున్న వాడిని 18 శాతానికి పెంచటం సమంజసం కాదు కదా అంటూ ప్రశ్నించారు. ఇటువంటి అంశాలపై చర్చించాలన్నారు. కానీ మనదేశంలో ఇదే సమస్య అన్నారు. ఎన్నికల ముందు మాత్రం హామీలు గుప్పించేసి, తర్వాత మరచిపోతున్నాం అంటూ ఆవేధన వ్యక్తం చేశారు. అందుకే సమస్యలు ఎదురువుతున్నట్లు చెప్పారు.

జిఎస్టీని పురిటినొప్పులతో వెంకయ్యనాయుడు పోల్చటం గమనార్హం. ప్రారంభదశలో ప్రభుత్వాలకు వచ్చే పురిటి నొప్పుల్లాంటిదే ఈ జీఎస్టీ కూడా అన్నారు. సింగపూర్ లో జిఎస్టీ 8 శాతమే అంటున్న వారికి అక్కడ వేసే మిగిలిన పన్నుల సంగతి తెలియదని ఎద్దేవా చేసారు. పనిలో పనిగా రాజకీయ వ్యవస్ధల గురించి కూడా ప్రస్తావించారు.

ఒక పార్టీ తరపున ఎన్నికైన వారు మరో పార్టీలోకి మారకుండా నిషేధించాలన్నారు. పొద్దున పార్టీ మారిన వాడు సాయంత్రానికి తన పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇలాంటి వారిపై తక్షణం చర్యలు తీసుకోలేకపోవటం దురదృష్ణమని వాపోయారు. పార్టీ ఫిరాయించిన వారిపై మూడు నెలల్లో చర్య తీసుకోవాలన్నది తన పాలసీగా స్పష్టం చేశారు. ఫిరాయింపులు ఉండకూడదంటే రాజకీయ వ్యవస్ధలోనే మార్పులు రావాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు.

loader