అప్పుడప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై కొందరు భాజపా నేతలు ఒంటికాలిపై లేస్తుంటారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసే భాజపా నేతల్లో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావులు ముందుంటారు. ఎవరి కారణాలు వారికున్నా చంద్రబాబు, టిడిపికి వ్యతిరేకంగా నలుగురు మాత్రం ఓ జట్టు. ఇంతకాలం చంద్రబాబును ఢిల్లీ స్ధాయిలో కాపుకాసిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోతున్నందున రాష్ట్రభాజపాలోని నలుగురు నేతలు రెచ్చిపోతారేమో అన్న ఆందోళన టిడిపి నేతల్లో కనబడుతోంది.

వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతిగా వెళుతున్న నేపధ్యంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వంతో పాటు నేతలపై ఒంటికాలిపై లేచే భారతీయ జనతా పార్టీ నేతలను ఆపేవాళ్ళున్నారా? పోయిన ఎన్నికల్లో రెండు పార్టీలూ కలిసే పోటీ చేసాయి. కలిసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. అయితే, అప్పుడప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలపై కొందరు భాజపా నేతలు ఒంటికాలిపై లేస్తుంటారు. పథకాల అమలులో అవకతవకలను, అవినీతిని ప్రధానంగా ఎత్తి చూపుతుంటారు. రెండు పార్టీల మధ్య వివాదాలు పెరుగుతున్నాయి అనుకున్నపుడు వెంకయ్య సీన్ లోకి వచ్చేవారు. ఇరువైపులా సర్దుబాటు చేసేవారు. దాంతో కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండేవారు.

చంద్రబాబుపై ఆరోపణలు చేసే భాజపా నేతల్లో సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, పురంధేశ్వరి, కావూరి సాంబశివరావులు ముందుంటారు. సోమువీర్రాజు, కన్నాలు చంద్రబాబుపైనే కాకుండా టిడిపి నేతలపైన కూడా ఓ రేంజిలో విరుచుకుపడుతుంటారు. చంద్రబాబు-పై ఇద్దరి నేతల మధ్య జాతి వైరం కూడా ఉందిలేండి. చంద్రబాబు-పురంధేశ్వరి, కావూరిలు ఒకే సామాజిక వర్గమే కాకుండా బంధువులన్న సంగతి కూడా అందరికీ తెలుసు. అయినా సోము, కన్నాల మాదిరే విరుచుకుపడుతుంటారు. కారణం పై ముగ్గురి మధ్య ఆధిపత్య పోరాటాలు తదితరాలు.

సరే ఎవరి కారణాలు వారికున్నా చంద్రబాబు, టిడిపికి వ్యతిరేకంగా నలుగురు మాత్రం ఓ జట్టు. ఆ విషయం అందరికీ తెలిసిందే. గడచిన మూడేళ్ళలో చంద్రబాబుకు వ్యతిరేకంగా జాతీయ నాయకత్వానికి, కేంద్రప్రభుత్వానికి వీరు నలుగురు ఎన్నో నివేదికలు, ఫిర్యాదులు చేసారు. పై స్ధాయిలో వెంకయ్య ఉన్నారు కాబట్టి చంద్రబాబుకు ఎటువంటి సమస్యలు ఎదురుకాకుండా కాపాడుతున్నారన్నది బహిరంగ రహస్యం.

అయితే, ఇంతకాలం చంద్రబాబును ఢిల్లీ స్ధాయిలో కాపుకాసిన వెంకయ్య ఉపరాష్ట్రపతిగా వెళ్ళిపోతున్నందున రాష్ట్రభాజపాలోని నలుగురు నేతలు రెచ్చిపోతారేమో అన్న ఆందోళన టిడిపి నేతల్లో కనబడుతోంది. ఎందుకంటే, ఈ నలుగురు నేతలు చంద్రబాబుపై విరుచుకుపడుతున్న ఏ సందర్భంలో కూడా జాతీయ నాయకత్వం వారించినట్లు కనబడలేదు. అంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో జాతీయ నాయకత్వం ఆశీస్సులున్నట్లే లెక్క. ఇటువంటి పరిస్ధితుల్లో ప్రత్యక్ష రాజకీయాల నుండి వెంకయ్యను బలవంతంగా పంపించేయటమంటే చంద్రబాబుకు, టిడిపికి బాగా ఇబ్బందే.