టిడిపికి వంశీ దూరమవుతున్నారా ?

is the gulf between vallabhaneni vamsi and the TDP widening
Highlights

  • గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి దూరమవుతున్నారా?
  • జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.

గన్నవరం టిడిపి ఎంఎల్ఏ వల్లభనేని వంశీ పార్టీకి దూరమవుతున్నారా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బుధవారం అసెంబ్లీ లో సిఎంవో కార్యాలయ అధికారికి, వంశీకి మధ్య జరిగిన వివాదం కేవలం ఒక సంఘటన మాత్రమే. కాకపోతే ఈ ఘటన వెనుక చాలా పెద్ద కథే ఉంది. ఇంతకీ అదేంటంటే, వంశీకి పార్టీ నాయకత్వానికి మధ్య చాలా కాలంగా గ్యాప్ పెరిగిపోయింది. చంద్రబాబునాయుడుకు కానీ నారా లోకేష్ కానీ వంశీకి పెద్దగా ప్రధాన్యత ఇవ్వటం లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. దాంతో జిల్లా పార్టీ నేతలు కూడా వంశీకి పెద్ద ప్రాముఖ్యత ఇవ్వటం లేదు.

అవటానికి వంశీ అధికారపార్టీ ఎంఎల్ఏనే అయినప్పటికీ పార్టీలో మాత్రం దాదాపు ఒంటరే. ఇది ఇప్పటికిప్పుడు జరిగింది కాదు. చాలా కాలంగా జిల్లా నేతలతో ప్రధానంగా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో విభేదాలు తీవ్ర స్ధాయిలో ఉన్నాయి. ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ విషయంలో వంశీ-ఉమ మధ్య వివాదం మొదలైంది. గుడెసె వాసులకు వంశీ అండగా నిలబడ్డ ఘటనలో ఎంఎల్ఏపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే విధంగా గన్నవరం నియోజకవర్గంలో రైతులకు చెందిన మోటార్లను విద్యుత్ శాఖ అధికారులు ఎత్తుకెళ్ళారు. అక్కడ కూడా వంశీకి ఉన్నతాధికారులకు విభేదాలొచ్చాయి.

అదే విధంగా తన ఆయుధాల లైసెన్సులను రెన్యువల్ చేయలేదన్న కోపంతో పోలీసు ఉన్నతాధికారులపై మండిపడ్డారు ఒకసారి. అంతేకాకుండా అందుకు నిరశనగా తన గన్ మెన్లను సరేండర్ చేసి వార్తల్లోకి ఎక్కారు. అప్పుడూ తనకు పార్టీ నుండి మద్దతు లభించలేదనే మనస్తాపంతో వంశీ ఉన్నారు. అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న దేవినేని నెహ్రూను కావాలనే తనకు వ్యతిరేకంగా కొందరు టిడిపిలోకి తీసుకొస్తున్నారంటూ వంశీ భావిస్తున్నారు. ఎందుకంటే, నెహ్రూ-వంశీల మధ్య తీవ్ర స్ధాయిలో వైరముంది.

ఇక, చివర అంశాన్ని పరిశీలిస్తే వంశీకి గుడివాడ వైసీపీ ఎంఎల్ఏ కొడాలి నానికి బాగా సన్నిహితముంది. అంతేకాకుండా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి కూడా సన్నిహితుడే. ఒకసారి జగన్-వంశీలు ఎదురుపడినపుడు రోడ్డులోనే ఇద్దరూ కావలించుకుని మాట్లాడుకున్నారు. దాంతో వంశీపై టిడిపి నేతలు, చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. ఇటువంటి అనేక ఘటనలు తోడవ్వటంతో వంశీపై అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. ఎప్పటికైనా వంశీ వైసీపీలో చేరిపోతారనే ప్రచారం బాగా జరుగుతోంది. టిడిపిలో జరుగుతున్న పరిణామాలు కూడా ఆ ప్రచారానికి మద్దతు తెలిపేవిగానే కనిపిస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.

 

loader