ఎంపిల వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికలు పార్టీకి గడ్డుకాలమేనన్నది స్పష్టమవుతోంది. అదికూడా పోయిన ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా నిలిచిన అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనే  పరిస్ధితే ఇలా వుంటే ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్ధితి ఎలాగుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో స్పష్టంగా కనబడుతోంది.

తెలుగుదేశం పార్టీ ఎంపిలు ఒక్కసారిగా ఎందుకు నిజాలు మాట్లాడేస్తున్నారు? ‘చంద్రబాబునాయుడుకు కోపం వచ్చిన సరే నిజాలు మాట్లాడక తప్పదం’టూ మనసులో మాటను బాహాటంగా బయటపెట్టేస్తున్నారు. ఇద్దరు ఎంపిలు జెసి దివాకర్ రెడ్డి, రాయపాటి సాంబశివరావు చేసిన వ్యాఖ్యలపై పార్టీలో సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇంతకీ వారి వ్యాఖ్యల పరమార్ధమేమిటి? జెసి మాట్లాడుతూ, అవసరం తీరిపోయిన తర్వాత చంద్రబాబు ఎవరినైనా సరే కరివేపాకు లాగ తీసిపారేస్తారని వ్యాఖ్యానించారు. ఇక, రాయపాటి మాట్లాడుతూ, చిన్న చిన్న పనులు కూడా చేయలేకపోతే జనాలు చెప్పులతో కొడతారంటూ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి.

జనాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగిపోతుందని ఇద్దరూ చెబుతూనే ఉన్నారు. ఆ విషయాన్నే గ్రహించే వారిద్దరూ బాహాటంగా మాట్లాడుతున్నారని పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. పార్టీ వర్గాల ప్రకారం పై ఇద్దరు ఎంపిలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది దాదాపు అనుమానమే. వారి స్ధానాల్లో వారసులు పోటీ చేసే అవకాశాలున్నాయి. అయితే, వారి వారసులు టిడిపి తరపున పోటీ చేయటానికి ఇష్టపడటం లేదని పార్టీ నేతలే చెబుతున్నారు.

ఎందుకంటే, వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కష్టమన్న భావనలో ఉన్నారట. అందుకనే వారిద్దరూ తమ మనసులో మాటను బాహాటంగా బయటపెట్టేస్తున్నారంటూ పార్టీ నేతలు అనుమానిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ లో జెసి కుమారుడు వైసీపీ తరపున పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతుండటం ఇందులో భాగమేనట. బహుశా రాయపాటి కొడుకు కూడా అలాంటి అలోచనలో ఉన్నాడేమో తెలియటం లేదు.

మొత్తానికి ఎంపిల వ్యాఖ్యలు చూస్తుంటే వచ్చే ఎన్నికలు పార్టీకి గడ్డుకాలమేనన్నది స్పష్టమవుతోంది. అదికూడా పోయిన ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా నిలిచిన అనంతపురం, గుంటూరు జిల్లాల్లోనే పరిస్ధితే ఇలా వుంటే ఇక మిగిలిన జిల్లాల్లో పరిస్ధితి ఎలాగుందోనన్న ఆందోళన పార్టీ నేతల్లో స్పష్టంగా కనబడుతోంది.

రాష్ట్రానికి ప్రత్యేకహోదా, ప్రత్యేకరైల్వే జోన్ ఎట్టి పరిస్ధితుల్లోనూ రాదంటూ జెసి మొదటి నుండి చెబుతూనే ఉన్నారు. ప్రత్యేకహోదా వస్తుందని కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, సుజనా చౌదరి, చంద్రబాబునాయుడుతో పాటు పలువురు చెబుతున్న రోజుల్లో కూడా జెసి తన మాటమీదే నిలబడ్డారు. చివరకు జెసి చెప్పిందే నిజమైంది. అదేవిధంగా విశాఖపట్నానికి ప్రత్యేకరైల్వే జోన్ రాదని మొదటినుండి రాయపాటి చెబుతూనే ఉన్నారు. ఇపుడు ఆమాటే నిజమవుతోంది. ముందుముందు ఇంకెదరు నేతలు వీరిలాగ నిజాలు మాట్లాడుతారో చూడాలి.