జగన్ యాత్ర భగ్నానికి కుట్రా ?

జగన్ యాత్ర భగ్నానికి కుట్రా ?

వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్ర విజయవంతంగా సాగుతుండటాన్ని ప్రభుత్వ పెద్దలు సహించలేకున్నారా? జరుగుతున్న పరిణామాలు, వైసీపీ నేతల ఆరోపణలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుండి పోలీసులు జగన్ యాత్రపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. దానికితోడు సభలను అడ్డుకోవటం, అనుమతి ఇచ్చి వెంటనే రద్దు చేయటానికి తోడు తాజాగా సభలో పాల్గొన్నారని కేసులు పెట్టడంతోనే అధికారపార్టీ జగన్ పై ఏదో కుట్ర చేస్తోందనే అనుమానాలకు తావిస్తోంది.

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా సభ నిర్వహించినందుకు జగన్ తో పాటు ఎంఎల్ఏ రోజా, కాటిసాని రాంభూపాల్ రెడ్డిపైన కూడా కేసు నమోదైంది. బనగానపల్లె నియోజకవర్గంలోని హుస్సేనాపూర్ లో సోమవారం మహిళలతో జగన్ సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. సమావేశం నిర్వహించేందుకు వైసీపీ నేతలు ముందుగానే జిల్లా ఎస్పీ నుండి అనుమతి తీసుకున్నా రాత్రికి రాత్రి డిఎస్పీ సభను రద్దు చేశారు.

సభకు అనుమతిని రద్దు చేసిన పోలీసులు ఎందుకు అనుమతిని రద్దు చేశామో అన్న విషయాన్ని మాత్రం చెప్పలేదు. దాంతో వైసీపీ నేతలు అనుమతి లేకపోయినా సభను నిర్వహించేశారు. సభకు మహిళలు హాజరుకాకుండా పోలీసులు కూడా చాలా చోట్ల అడ్డుకున్నారు. అయినా పోలీసు ఆంక్షలను కాదని మహిళలు కూడా భారీ సంఖ్యలోనే హాజరయ్యారు. దాంతో ప్రభుత్వానికి బాగా మండింది.

సరే, కారణాలను పక్కనబెట్టిన పోలీసులు అనుమతి లేకుండానే సభ నిర్వహించటం చట్ట విరుద్దమంటూ పోలీసులు కొత్త వాదన మొదలుపెట్టారు. సభ నిర్వహణకు బాధ్యత తీసుకున్నందుకు కాటసాని రాంభూపాల్ రెడ్డిపైన, పాల్గొన్నందుకు జగన్, రోజాలపై పోలీసులు కేసులు నమోదు చేయటమే విచిత్రంగా ఉంది.

పోలీసుల వైఖరి చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే జగన్ పై కేసులు నమోదు చేసిన విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. ఎందుకంటే, సభ నిర్వహణకు ముందు అనుమతించిన పోలీసులు రాత్రికి రాత్రి రద్దు చేయటానికి కారణాలు మాత్రం చెప్పటం లేదు. కారణాలు చెప్పకపోవటంతోనే జగన్ యాత్రను భగ్నం చేయటానికి అధికారపార్టీ పెద్దలు కుట్రలు చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM Andhra Pradesh

Next page