వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారా?
వచ్చే ఎన్నికల్లోగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆర్ధిక మూలాలను దెబ్బకొట్టాలని చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారా? జగన్ అవినీతిపరునిగా మళ్ళీ ముద్రవేసి ఎన్నికల సమయానికి బయట తిరగనీయకుండా వ్యూహం ఏదైనా రచిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు తాజా మాటలు వింటుంటే. ‘వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి’ అని తాజాగా చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు.
ఇంతకీ జగన్ ఆస్తులను ఎందుకు స్వాధీనం చేసుకోవాలట? అంటే, జగన్ ఆస్తులన్నీ అక్రమ సంపాదనేట. అలాగని ఎవరు తేల్చారు? ఇంకెవరు చంద్రబాబే తేల్చేసారు. ఒకవైపు జగన్ అక్రమాస్తుల కేసులపై న్యాయస్ధానాలు విచారణ జరుపుతున్నాయి. అదే సందర్భంలో జగన్ కు సంబంధించిన కొన్ని ఆస్తులను ఇడి, సిబిఐ అటాచ్ చేసుకున్నాయి. సిబిఐ, ఈడీ విచారణ జరుపుతున్న కేసుల్లోని ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్వాధీనం చేసుకుంటుందో చంద్రబాబు, యనమలే చెప్పాలి ?
అయితే ఏ ఒక్క కేసులో కూడా జగన్ అక్రమాలకు పాల్పడ్డారని, ఆస్తులు సంపాదించారని నిరూపితం కాలేదు. జగన్ అవినీతిపరుడు అని నిరూపితం కావాలంటే అందుకు ఏకైక మార్గం కోర్టులో తేలటమే. కోర్టు తీర్పు ఇస్తేనే జగన్ అవినీతిపరుని క్రింద లెక్క. అప్పటి వరకూ కేవలం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేత మాత్రమే.
కానీ, 40 ఇయర్స్ ఇండస్ట్రీ మాత్రం ఏం చెబుతున్నారు. ఒకవైపు కోర్టులో విచారణను ఎదుర్కుంటున్న వ్యక్తిని కోర్టు బయట అవినీతిపరునిగా తేల్చేసారు. అంతేకాకుండా జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని తెగ ఉబలాట పడిపోతున్నారు. సరే, ఈ కోరిక ఇప్పటిది కాదులేండి. చాలాకాలంగా జగన్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చంద్రబాబు, యనమల రామకృష్ణుడు లాంటి వాళ్ళు చెబుతూనే ఉన్నారు. అంటే, ఇక్కడేం అర్ధమవుతోంది? వచ్చే ఎన్నికల్లోగా జగన్ అవినీతిపరునిగా చిత్రీకరించి, ఆర్ధిక మూలాలను దెబ్బ కొట్టాలన్నది చంద్రబాబు వ్యూహంగా కనబడటం లేదూ?
