అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు మాజీ ఎంఎల్ఏ, వైసిపి అధికార ప్రతినిధి అంబటి రాంబాబుపై చర్యలకు రంగం సిద్దమైనట్లే కనబడుతోంది. సోమవారం మీడయాతో మాట్లాడుతూ, స్పీకర్ పై అంబటి తీవ్రమైన వ్యాఖ్యలే చేశారు. దాంతో మంగళవారం అదే విషయమై అసెంబ్లీలో ఎంఎల్ఏ పల్లె రఘునాధారెడ్డి లేవనెత్తారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అంబటిపై చర్యలు తీసుకోవాలంటూ సూచించారు. అయితే, స్పీకర్ మాట్లాడుతూ, శాసనసభా వ్యవహారాల శాఖమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటానని బదులిచ్చారు.

చూడబోతే అంబటిపై చర్యలకు రంగం సిద్దమవుతున్నట్లే కనబడుతోంది. ఎందుకంటే, చంద్రబాబునాయుడు, మంత్రులు, టిడిపి నేతలపై వైసీపీ తరపున ప్రతీరోజూ విరుచుకుపడే నేతల్లో అంబటి కూడా ఒకరు. ప్రతీ అంశాన్ని చక్కగా వివరిస్తూ, ప్రభుత్వ తప్పులను పద్దతిగా ఎండగడుతుంటారు అంబటి. ఒకవిధంగా ఎంఎల్ఏలు మొన్నటి వరకూ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో ఎలా ఇరుకునపెట్టేవారో అంబటి కూడా ప్రభుత్వాన్ని బయట అంతే స్ధాయిలో ఇబ్బంది పెట్టేవారు.

అటువంటి అంబటి, స్పీకర్ స్ధానాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దాంతో దొరికిన అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలన్నది టిడిపి సభ్యుల ప్లాన్ గా కనబడుతోంది. ఎందుకేంటే, స్పీకర్ పై ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేసినా విచారణ జరిపి శిక్ష విధించే అధికారం స్సీకర్ స్ధానానికి ఉంది. ఆ అధికారాలనే ఇపుడు అంబటి విషయంలో ఉపయోగించుకోవాలని పలువురు సభ్యులు సూచిస్తున్నారు. ఎటుతిరిగీ అంబటిది, స్పీకర్ ది ఒకే నియోజకవర్గం. ఇద్దరూ చిరకాల ప్రత్యర్ధులే కాబట్టి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునే అవకాశాలే ఎక్కువున్నాయి.